పుట:Narayana Rao Novel.djvu/104

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయ భాగము

౧ ( 1 )

మంగళగౌరి

శ్రావణమాసము. గోదావరి గాలులతో, వర్షపాతములతో, ముసురులతో, సూర్యనారాయణుని దాగుడుమూతలతో, సర్వత్ర పొడచూపు శాద్వలహారితవర్ణముతో వరదల బురదనీటి జేగురువర్ణముతో, నీలిమబ్బులతో మంగళవారము నాడు వీధుల తేలియాడు మందగమనల కౌశేయ వివిధ వర్ణములతో బ్రత్యక్ష మగును.

ఆడువారి మంగళవారములనోము లీ మాసమున ఏల ఏర్పడెను? వివాహమైన వెనుక నైదుసంవత్సరము లీ నోము నోచుకొనవలెనట. నోముపట్టిన పిమ్మట నే వత్సరముననైన నుద్యాపన చేయవచ్చునట. పెళ్ళిలో ‘సప్తపది’ నాడు ఉద్యాపన చేసికొనవలెను. ఆ వధువునకు మంగళసూత్రము మెడనుగట్టి, కాళ్లకు మట్టియలు దొడిగి, పాదాంగుళులపై మిఠాయి నుంచి, పదమూడు జతల యరిసెలు గిన్నెలోనుంచి, రవికెలగుడ్డ వాసినెగట్టి, పసుపు కుంకుమలతో వాయనమిచ్చి, యుద్యాపన చేసికొనవలెనట. శ్రావణ మంగళవారమునా డుదయమున నభ్యంగన మొనరించి, మడితో మంగళగౌరీదేవి నారాధించి కథచెప్పుకొని, యక్షతల శిరస్సున నిడుకొని, చలిమిడిగురుగులందు నావునేతితో దీపాలు వెలిగించి, యా పొగతో కాటుకబట్టి నేత్రముల నలంకరించి, మహానైవేద్యము, సెనగలు నైవేద్యము సమర్పణజేసి ముత్తయిదువులకు బసుపురాచి, బొట్టుపెట్టి, కాటుకనిచ్చి, గంధమలది, తాంబూలములతో సెనగల వాయన మీయవలెను.

శ్రావణ మంగళవారముల నూరిలోనున్న వనితామణు లొకరిపరిచయ మొకరు సంపాదించుకొని కుశలప్రశ్నము లొనర్చుకొనుచు, విడ్డూరముల నాడుకొనుచు, లోకాభిరామాయణము చెప్పికొనుచు, వీరిని వారిని ఆడి పోసుకొనుచు, నగల విషయ మడుగుకొనుచు గాలక్షేప మొనర్తురు. తమకున్న చీని చీనాంబరముల, బనారసు, బెంగుళూరు, మధుర చీరల ధరించి, రవికల తొడుగుకొని, యత్తరవు లలంది, పూవుల ధరించి, నగల గైసేసికొని, జట్టులుగా మందగమనములతో వోయారముతో దారిలో క్రీగంటి చూపులతో దేవతా స్త్రీలవలె పేరంటములకు బోవుదురు. చేతనున్న రుమాళ్ళయందు సెనగలు మూటగట్టుకొందురు. మాతలు శిశువుల నెత్తికొనియే బయలు దేరుదురు. విలాసవతుల హావభావముల గమనించి యువ్విళులూరుటకు వేషములు దాల్చిన కోడెగాండ్రు పనియున్న వారివలె నూరంతయు దిరుగుదురు. ఇంతలో నొక జడివచ్చిన బరుగిడలేక యెట్లో నొకపంచ జేరి వాల్గంటులజూచి దరహాసవదను లగుదురు.