పుట:Narayana Rao Novel.djvu/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

105

మంగళగౌరి


వశురా లైనది. అటు నవమన్మథుడగు కుమారుడు, ఇటు సౌందర్యోజ్జ్వలయగు కోడలు, సాక్షాత్కరించిన రతీబాల. ఒకరికొర కొకరు జన్మించినారా!

ఆ రాత్రి జానకమ్మగారు కోడలికి ఉప్పు మిరపకాయలను, పారాణినీళ్ళు దృష్టితీసి, పారాణినీళ్ళు దొడ్డిలో దూరముగాను, ఉప్పు మిరపకాయలను నిప్ప లోను వేసినది. యెంత దృష్టితగిలెనో కాని ఘాటేమియు రాలేదట. ఈవింతను వరదకామేశ్వరీదేవి చూచి వెడనవ్వు నవ్వుకొన్నది.

శారద కివియన్నియు జిత్రముగా నుండెను. అత్తవారింటివారు బూర్వ సంప్రదాయములతో, బూర్వాచారములతో మెలగుదురు. తన పెద్దత్తగారు నిప్పులు కడుగును. మైలపడితి నేమోయన్న భయముచే బదిసారులు స్నానము చేయును. ఏ పర్వదినము వచ్చినను గోదావరికి స్నానమునకు బోవును. వంట వండుటకు వలయు జలమంతయు దానే తోడుకొనును. తక్కినవారి కొక నీళ్ళ బ్రాహ్మణుడు నీళ్ళుపోయును.

ఆ మరునాడు జానకమ్మగారు కొత్తపేట వచ్చి వేసినది.

జానకమ్మగారి కంత చేదస్తము లేకపోయినను ఆమెయు బూర్వాచారవతియనియే యెన్నవలెను.

వంటయింటిలోనికి బిల్లలెవ్వరు వెళ్ళగూడదు. వారి భోజనాలగది వేఱు. ఉదయము వారి వంటజేయవలసిన దచ్చటనే.

లక్ష్మీనరసమ్మ గారు భోజనము వేళ మంచినీరు త్రాగిన చెంబులోని నీటితో జేయికడుగనీయదు. పట్టుబట్టలగాని, మడిబట్టలగాని కట్టుకొనకుండ భోజనము చేయరాదు. బొట్టులేకుండ నుండరాదు. ఆమె మోమోటము లేకుండ నెట్టి వారిని లెక్కచేయకుండ నాచారము గమనించుడని బోధించుచుండును. శారద యత్తవారింట నున్న గృహప్రవేశపు రోజులలో ఆమె కాచారవిషయికములగు నీతు లెన్నియో పెద్దత్తగారు కఱపినది. తాంబూలము నమలుచు శారద పంటిలో దూరిన నలుసును చేతితో దీసికొని రుమాలతో దుడుచుకొనుచుండ లక్ష్మీనరసమ్మగారు చూచి ‘అయ్యయ్యో! యెంగిలమ్మా, తల్లీ! చేయికడుక్కోవమ్మా. ఆ రుమాలును పనిచేసేది తడిపి ఆరేసేగుడ్డలో వెయ్యి’ అని కోడలిచే నాపనులు చేయించినది.

‘ఏమే అక్కా! ఇంత చాదస్తం నీ కెప్పుడు తగ్గుతుందే?’ యని జానకమ్మ పాటపాడుచునే యుండును. అయిన నేమి లాభము?

లక్ష్మీనరసమ్మ వేదాంతురాలు. ఎప్పుడును వేదాంత గ్రంథాలు చదువు చుండును, చదివించుకొనుచుండును. ఆమెకు జుట్టముల గ్రామములందు పలువురు శిష్యురాండ్రున్నారు. వారందరు గురువుగారిని దర్శించుటకు వచ్చుచునే యుందురు. అప్పుడు గురువుగారి పాదాలకు నమస్కరించి, ఫలములు, రూపాయలు, వెండిగిన్నెలు దక్షిణలిచ్చి వేదాంతపు ముక్కలు చెవిలో వేసికొని