పుట:Nanakucharitra021651mbp.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాక హానికరమనియు దాని నభ్యసించినవారు సంసారపాశములం దగుల్కొని యెన్నటికిం బయల్పడఁజాలరనియు మనుష్యులు శ్రద్ధతో నేర్చికొనవలసిన విద్య వేరొకటి యున్నదనియు సత్యమును గ్రహించుట భగవంతునియెడ భక్తిగలిగియుండుట భగవన్నామము కీర్తనముసేయుట మొదలగునవియే నిజమైన విద్యలనియు నవియే యుభయలోక తారకములనియు గురువునకు బదులు చెప్పెనఁట. అప్పలుకులు పలికి యంతట నూరకుండక నానకు భక్తితత్వముం దెలుపు శ్లోకము నొక దానిని జదివెనఁట. ఆశ్లోకార్థమిది.

“నీ లోకానురాగము సిరాజేసి నీబుద్ధిఫలకము కాగితము జేసి నీమనస్సు వ్రాతగాడుగ జేసి పరమేశ్వరుని గూర్చి వ్రాయుము. వ్రాసి వానియందు దృష్టినిలుపుము. ఏమివ్రాయవలయునని తలంచుచున్నాడవు. భగవన్నామము వ్రాయుము. భగవత్కీర్తనలు వ్రాయుము. భగవంతుఁ డాద్యంతశూన్యుఁడన్న మాట వ్రాయుము. మిత్రుడా! ఇట్టి వ్రాత నేర్చుకొంటివేని దేవుని యెదుటకు నీవు బోయి యీలోకమున నీవు నడచిన నడతకు సరిగ లెక్క చెప్పవలసివచ్చినప్పుడు తప్పక యావ్రాత నీపక్షము బూని కళంకరహితమై నిన్ను రక్షించును.”

ఏడుపదుల యేండ్ల వయసుగల వృద్ధుని నోటనుండి వెడలవలసిన యాభక్తిరస ప్రథాన వచనములు విని గురువు