పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
5. కొన్ని ముఖ్యమైన విలువలు
1. సామాజిక విలువలు

మామూలుగా మనం వ్యక్తిగతమైన విలువల మీదనే ఎక్కువ శ్రద్ధ జూపుతాం. కాని సామాజిక విలువలు కూడ ముఖ్యమే. నేడు ప్రజలంతా కలిసి పోగోరుతున్నారు. కనుక సామాజిక విలువలనుగూడ పట్టించుకోవాలి. ఇక్కడ అతి ముఖ్యమైన సామాజిక విలువలను కొన్నిటిని పరిశీలిద్దాం.

1. ప్రేమ, కరుణ చూపడం

ప్రేమ కొరకు అందరూ తపించిపోతారు. కావున ఇతరులను ఆదరంతో చూడాలి. ఈ లోక సుఖాలకు సదుపాయాలకూ నోచుకోక వ్యాధిబాధలు అనుభవించే అభాగ్యులు ఎందరో వుంటారు. వారికి మనకు చేతనైన సహాయం చేయాలి.

2. తోడివారిని పట్టించుకోవడం

మన చుటూ వున్నవారి బాగోగులను పట్టించుకోవాలి. మనకున్నవి లేనివారితో కొద్దిగానైన పంచుకోవాలి. మన దేశంలో అధిక సంఖ్యాకులు పేదలు. విశేషంగా నిరుపేదలకు సాయం చేయడం అలవాటు చేసికోవాలి.

3. మర్యాదను పాటించడం

మర్యాదను ఇచ్చి పుచ్చుకొంటాం. సభ్యతగా ప్రవర్తిస్తే ప్రజలు సంతోషిస్తారు. అసభ్యతను అందరూ ఏవగించుకొంటారు. ఎప్పడు పెద్దమనిషిలాగ మెలగడం అలవాటు చేసికోవాలి.

4. కృతజ్ఞతా భావం

జీవితంలో ఎంతోమంది మనకు ఉపకారం చేస్తుంటారు. వాళ్లపట్ల కృతజ్ఞలమై యుండాలి. ఆలాగే ఇతరుల్లోని మంచి గుణాన్ని మెచ్చుకోవడం అలవాటు చేసికోవాలి. కొన్ని పర్యాయాలు జంతువులకున్న కృతజ్ఞత కూడ నరులకుండదు. నరులకుండదు.