పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎప్పుడూ మనం ఎన్నుకొనే మార్గాలూ, అనుసరించే పద్ధతులూ మన విలువలను బట్టే వుంటాయి. పలానా వ్యక్తి నమ్మదగినవాడు, పలానా మనిషి మోసగాడు అంటాం. ఈ వ్యత్యాసం ఆ యిద్దరు పాటించే విలువలను బట్టే వచ్చింది. విలువలను పాటించకుండ ఏ నరులూ పనికి పూనుకోరు. కాని ఆ విలువలు మంచివైతే మనకు మంచిపేరు వస్తుంది. చెడ్డవైతే చెడ్డ పేరే వస్తుంది.


అంత తేలిక కాకపోయినా విలువలను మార్చుకోవచ్చు. కావుననే దుర్మారులు మంచివాళుగా మారినట్లు వింటున్నాం. ఆలాగే ఇతరుల దుప్రభావానికి గురై మంచివాళ్లు అపమార్గం పట్టినట్లుగా కూడ వింటున్నాం.

ఒక్క అంశం ముఖ్యం. మన మంచి పేరు చాలవరకు మనం పాటించే విలువలను బట్టే వుంటుంది. శాంతియుతంగా స్వాతంత్ర్యం సంపాదించి పెట్టినందుకు గాంధీగారిని గౌరవిస్తున్నాం. కరుణతో పేదసాదలను ఆదుకొన్నందుకు మదర్ తెరేసాను స్మరించుకొంటున్నాం. బోసు, భగత్ సింగ్ మొదలైన వారి దేశభక్తిని గుర్తుతెచ్చు కొంటున్నాం. వీళ్లంతా గొప్పవిలువలు పాటించి భావి తరాలవాళ్లకు ఆదర్శంగా నిలిచారు. మోసాలు, హత్యలు, మానభంగాలు, లంచాలు మొదలైన చెడ్డవిలువలను పాటించి అందరిచేత చీకొట్టించుకొన్నవాళ్లు అప్పడూ యిప్పడూ కూడ చాలమంది వున్నారు. జనం దుష్ట విలువలను పాటించి తాత్కాలికంగా పేరు తెచ్చుకొన్నా తర్వాత ఊరూపేరూ లేకుండ పోతారు. అంతా మనం ఎన్నుకొనే విలువలను బట్టే వుంటుంది.

విద్యార్థులు చిన్ననాటినుండి తమ విలువలు ఏలాంటివా అని పరిశీలించి చూచుకోవాలి. మంచి విలువలను ఎన్నుకొని సమాజంలో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలి. తామెన్నుకొనిన విలువలను అనుదిన జీవితంలో ఖండితంగా పాటించాలి. మనం చదువుకొనే విద్యాసంస్థలు ఎన్నో గొప్ప విలువలను నేర్పుతాయి. వాటిని పాటించడంలో శ్రద్ధ చూపాలి. మన విలువలే మనకు కీర్తికాని అపకీర్తికాని తెచ్చిపెడతాయి.