పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాటిని వాళ్లు ఎన్నుకొని పాటించవచ్చు. కాని మనం ఎన్నుకొన్న విలువను మళ్లా మళ్లా పాటించాలి. అప్పుడే గాని అది మనకు శక్తినీ విజయాన్నీ చేకూర్చి పెట్టదు.

విలువలు ఏలా ఏర్పడతాయి?

విలువలను కొంతవరకు మనంతట మనమే ఏర్పరచుకొంటాం. కొంతవరకు ఇతరులను ఆదర్శంగా తీసికొని కూడ ఏర్పరచుకొంటాం. తల్లిదండ్రులనుండి కొన్ని విలువలను నేర్చుకొంటాం. ఉపాధ్యాయులు పెద్దలు కూడ మనకు విలువలను నేర్పుతారు. చాలమంది స్నేహితుల నుండి పరిచితులనుండి కొన్ని విలువలను గ్రహిస్తారు. దేశనాయకులూ, ఆయారంగాల్లో ఆరితేరిన నిపుణులూ కూడ మనకు కొన్ని విలువలు నేర్పుతారు. గొప్పగ్రంథాలు కూడ విలువలను అలవరుస్తాయి. ఈ విధంగా మనం అనుసరించే విలువలు చాలమంది నుండి ఏర్పడుతుంటాయి. ఎవరినుండి వచ్చినా చివరకు అవి మన సొంతమై పోతాయి.

విలువల ప్రాముఖ్యం

మన ప్రవర్తన మన విలువలను బట్టే వుంటుంది. ఇతరులను బాధించకూడదు అనే మంచి విలువను నమ్మినవాడు ఎప్పుడూ సున్నితంగా మెలుగుతాడు. తోడివారికి మేలేగాని కీడు చేయడు. నీతినియమాలు గాలికి వదలి ఏలాగైనా డబ్బు సంపాదించాలి అనే చెడ్డ విలువను నమ్మినవాడు మోసాలకు పాల్పడతాడు. అబద్ధాలకూ అన్యాయాలకూ పూనుకొంటాడు. ఈలా మనం ఎన్నుకొన్న విలువలే రోజువారి జీవితంలో మనలను నడిపిస్తుంటాయి. నరులు వారి విలువలను బట్టే ఆయా నిర్ణయాలు చేసికొంటారు. తమ విలువలకు అనుగుణంగానే తోడివారితో మెలుగుతుంటారు. విలువల దృక్కోణం నుండే వస్తువులను అంచనా వేస్తారు. మన జీవితగమనం ఎప్పడూ మన విలువలను బట్టే వుంటుంది. గాంధీ, మండేలా శాంతిప్రియులు. కనుక శాంతి మార్గాన్నే అనుసరించారు. చెంగిస్ ఖాన్, తైమూర్ హింసావాదులు. కనుక హింసామార్గాన్నే అనుసరించారు. ఏ విత్తు నాటామో ఆ_చైట్లే మొలుస్తుంది.