పుట:NagaraSarwaswam.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23

ఇలా కేవలం శరీరాన్ని అలంకరించుకొనడమే కాక నాగరకులు తమ నివాసాలనుకూడ సుందరంగా అలంకరించి స్వచ్చంగా ఉంచుకొనాలి. ఏమంటే తాము ప్రేమించేజనం అనుకోకుండా తమయింటికి రావడం జరిగితే-తమ నివాసం కశ్మలంగా మలినంగా ఉంటే- తమ వేషం కారణంగా వారిమనస్సులో ఏర్పడుతూన్న సుముఖత కాస్తా నశించిపోతుంది. ఏమంటే- "ఇతడు బయటకు వచ్చినపుడు కొంచెం అలంకరించు కొంటాడేకాని ఇంటి దగ్గఱ గొడ్డులా ఉంటాడు. చీ ! చీ! యీ యింటిలో ఎలా ఉంటున్నాడు? ఏ వస్తువుకూ తీరుతెన్నూ లేదు. ఇలాంటి మలిన ప్రదేశాలలో ఉండేవాని మనస్సుకూడ మలినంగానే ఉంటుంది. నేనేదో మంచివాడు, అందంగా- నాజూకుగా ఉన్నాడనుకొన్నాను. వీని అసలు రూపం ఈ ఇంటిలోని వస్తువులను చూస్తే తెలుస్తోంది. చాలు వీనితోడి స్నేహం”- అన్న భావం వారి మనస్సులో కలుగుతుంది.

అందుచే నాగరకజనం తమ నివాసాన్ని సుందర వస్తునిచయంతో చూపరదృష్టిని ఆకర్షించేలా ఆలంకరించాలి. వీణ-వేణువు మృదంగము మొదలగు వస్తులను గృహంలో సముచిత స్థానంలోవుంచాలి. అవి దృష్టిని ఆకర్షిస్తాయి. తాము ఎవరి అనురాగాన్ని వాంఛిస్తున్నారో వారే తమయింటికి తలవని తలంపుగా వచ్చి-వీనిని చూస్తే వారిమనన్సులో రేఖామాత్రంగా వున్న సుముఖత పెరుగుతుంది. "కేవలం వేషమే అనుకొన్నాము. ఇల్లుకూడ చూడముచ్చటగా వున్నది. ప్రతి వస్తువూ చక్కగా వుండవలసినచోటవున్నది. వీణ-వేణువు మృదంగము కనబడుతున్నాయి. వానియందుకూడ ఇతనికి ప్రవేశంఉన్నది, కాబోలు. ఒకవేళ ప్రవేశం లేకపోయినా ఆకళ (సంగీతము) అంటే ఇతనికి మంచి ఆసక్తి అయినా వుండివుండాలి. లేకపోతే ఇవి ఇక్కడ ఎందుకుంటాయి.! ఏమో అనుకొన్నాను. మొత్తానికి ఇతడు మంచి రసికుడే!-"అన్నభావం వారి మనస్సులో కలుగుతుంది.”