పుట:Naayakuraalu.Play.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

35

చూ డీ వరిగెదుబ్బు. యెన్ను బరువై కదలలేని నిండు చూలాలివలె పిల్లగాలికి బందికాడుతున్నది.

రా : సమయానికి దీనికి నీ సహాయ ముండదుగదా ? యే కోతకత్తె దాని జన్మము సార్థకము చేయవలసివున్నదో ?

నా : గోలలైన యీ గోవులను విడిచి కపటములకూ, కుట్రలకూ, మోసములకూ ఉనికిపట్టైన రాచకార్యములలో ప్రవేశిస్తున్నాను. ఈ అడుసులో దిగబడి నా యెద కూరుకొనిపోతుందో, కుమ్మరిపురుగువలె సంచరిస్తుందో చెప్పలేను.

రా : అంటించుకొంటే అంటుతుంది. నా” అనే అక్షరం తీసివేయి, ఏదీ అంటదు - అదిగో కపిల ! నీవు దూరము వెళ్లబోతున్నావని సడిగన్నట్టున్నది. ఓసి దాని కడుపుడక - ఎట్లా అలుముకుంటున్నదో చూడు.

నా: (వీపు నిమిరి) దీనికి మలుగులు కుంగినవి. ఎక్కువ రోజులు పట్టదు. ఈనంగనే నాకు వుత్తరం వ్రాయి. ఎల్లావు నే లేకపోతే దిగులుపడుతుందిగాఁవాఁలె.

రా : అది నిన్ను ముట్టెతో రమ్మని పిలుస్తున్నది. దగ్గరకు పద-- ఏమి చేస్తుందో.

నా: (కొమ్ముపట్టుకొని వూపి) నే పోయివచ్చేదా ? ఎందుకు ముట్టె నా వొళ్ళో పెడతావు ? నీ కేమైన తాయం తెచ్చాననుకొన్నా వా ?

రా : బుడిగిది పుట్టినప్పటినుంచి నీకు మాలిమి. నీవు లేకపోతే పాలీయదు.