పుట:Naayakuraalu.Play.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

నాయకురాలు

నా : నేను రెండుచేతులతో ఏకధారగా పాలు తీస్తుంటే అది కండ్లు మూసుకొని వొళ్ళు మరిచి మహదానందంతో కాలు కదపకుండా వూగుతూ నిలువబడేది. నేనూ వొళ్ళు మరిచే దాన్ని, ఇక కొన్నాళ్ళదాకా నా కీ ఆనందం లభించదు కదా!

రా : దీని యెడదూడను యెట్లా మరచివుంటావే? నీ కది మనుమరాలుగదా.

నా : ఇళ్ళో - అబ్బా - నే నేమి జేసేదే ; అయ్యా, చూడు. దానికి బాగా వయస్సు మొటమరిస్తున్నది. దాని కాటిక కండ్లకు తోడుగా సిగమోరతాడు వేయిస్తే కళకళ్లాడుతూ పెండ్లికూతురువలె వుంటుంది. (ముద్దు పెట్టుకొని) ఇగ పో, అయ్యా ! పులి కాటువేసి తల్లిబోయిన యీ చిన్ని పెయ్యను నే విడిచిపోలేను. నావెంటనే తీసుకుపోతా. పోతపాలచేత గాబోలు, దీనికి పొట్ట పెరిగింది.

రా : తీసుకపోనవసరములేదమ్మా, నీ మారుగా నే చూచు కుంటాగా,

నా : దానికి కొమ్ములు రాకపోయినా, రేపు సంక్రాంతికి కొమ్ములు మొల్చేచోట సున్నము, ఎర్రమన్ను చుక్కలు రాయించు.

రా: అట్లాగేలే. మళ్లీ ప్రయాణానికి యెండపడుతుంది, పద .

నా: నేను గురిజాలపోయినా ఆ కోడెదూడ మువ్వల పట్టెడ రవళి, చిరుగంటల చప్పుడు పొద్దుగూకులు చెవులో మోగుతుసే వుంటవి. ఆ కాలి వెండ్రుకలతాడు అందానికి అందె వేసుకొన్నట్టుగా వుంది. బసవడూ ! ఇటు రారా, చూడు-