పుట:Naayakuraalu.Play.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xviii

గారి కీ రెండును కొట్టినపిండి. వారి రచనములో భాషాభావములు అన్యోన్యసామరస్యముతో కలసిమెలసి ముద్దులుగులుకుచుండును. గ్రాంథికభాషయందు వారికి అపారమగు నభిమానమును, ఆదరమును ఉన్ననూ ఇట్టి చారిత్రికనాటకములయొక్క ఘనాదర్శములను వెల్లడించుటకై వారు మారుమూలభాషకై – స్వపాండిత్య ప్రదర్శన గౌరవమునకై --పరుగులెత్తక , నిత్యకృత్యవ్యవహారముల నుపయోగించునట్టి, శిష్టసంవ్యవహారమున నున్నట్టి భాషనే (అనగా వాడుక భాషనే) ప్రధానముగా గొని గ్రంథములను తీర్చుచున్నారు. “కవయః కాళిదాసాద్యాః కవయో వయమప్యమీ" అన్నట్టులు అస్మాదృశులముకూడ ఏదో కొంచె మించుమించు వ్యావహారికభాషను వాడుటకు ప్రయత్నించుచున్న వారమే యయ్యును, వారి సిద్ధహస్త సౌభాగ్యమును మేము పూర్తిగ కాంచలేకున్నాము. కాంచలేకున్నా మనుటయేల ? రసవత్తరమును, అనన్యసామాన్యప్రతిభావిలసితమును నైన వారి వాడుకభాషా రచనమగు నీ కృతికి యథామతి పీఠికను వ్రాయుటకు పూనుకొనినప్పుడు నామట్టునకు నాకు జంకు కలిగినది. కాని, ఆప్తులగువారి యానతియే నన్ను ఉత్సాహపరతంత్రునిగాచేసి, గ్రాంథికభాషలో నిట్లు నా లేఖినిని ప్రసరింపచేసినది. కావున నిందులకై శ్రీ పంతులుగారిని, తదితరులగు గ్రంధపాఠకులను మన్నింప వేడుచు వాఙ్మనఃకాయము లనెడి త్రికరణములద్వారా సర్వదా లోక శ్రేయమునకై తమ తనుమనోధనములను వినియోగించి, కృతార్థులగుచు సోదరాంధ్రజాతినంతను కృతార్థత నెనయించుచు నున్న బ్రాహ్మశ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణపంతులుగారి కీర్తి యాచంద్రతారకముగా నెలకొని, భవిష్యదాంధ్రయువకులకు సర్వవిధముల నాదర్శమై వెలయునట్లు చేయుమని అకారణదయాళువును, సర్వలోక నియంతయును నైన యా జదీశ్వరుని నిరంతరము వేడుకొనుచు నింతతో నా యీ లేఖినిని విషయాంతరమున నేమించెదను.

క్రోదన-ఫాల్గుణ పూర్ణిమ

చెన్నపురి

ఇట్లు విధేయుడు

పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి