పుట:Naayakuraalu.Play.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xvii

భాగములందుకంటె, ఈ యొక్కయంకమును నిర్మించుటలో గ్రంథకర్తగారు అతులమగు నైపుణ్యమును, ప్రజ్ఞావిశేషమును, పదర్శించి మనల సంతృప్తులచేసి ధన్యతను చేకూర్చుకొను చున్నారు. తర్వాత నైదవ యంకము నారంభమున మఱల ప్రతాపపాత్రమును ప్రవేశపెట్టి నిత్యసత్యవ్రతపూర్ణమగు అహింసారంగమున నెంతెంతటి యుత్తమపాత్రములున్నూ తమ తమ పాత్రములను ప్రదర్శించుటలో ఎట్టు లెట్టులు శక్తి చాలకున్నదియును సూచించుచు, అహింసాతత్వము నెఱుగనికతన కలుగబోవుచున్న సర్వనాశనమునకై ప్రజ లెట్లు పాత్రములు కాబోవుచున్నదియును వెల్లడించుచు నిష్క్రమించును. ఇకను మిగిలినది ఆరవ యంకము, ఈ యంకమునందు వెనుకటి యంకములలోవలె గాక ప్రతాపపాత్రము ఆద్యంతముల రెంటను ప్రవేశము గాంచుచున్నది. అందులో తొలుత బీభత్సరసప్రాదుర్భావస్థితిని అంకాదియందును. ప్రళయగీతమును గానముచేయుటమూలమున బీభత్సరనిపరిపూర్ణ స్థితిని అంకాంతమునను కీర్తింపజేసి సంకోచ వికాసముల పరిణామములను వెల్లడించి, యంతతో ఈ పాత్రము నిష్క్రమణము జెందును. దీనితో నీ నాటకముగూడ పూర్తియగును. ఇట్టి రచనాసంవిధానము మనకు నూత్నమును, ముఖ్యముగా దృశ్యకావ్యముల ప్రయోజనమును నిర్ణయించునదియును నయియుండి, ప్రేక్షకుల మనస్సుల కవాజ్మానసగోచరమగు తాత్త్విక స్థితిని గల్గించుట ద్వారా ఆనందపరాకాష్ఠను వెలయించుచున్నది. ఇంతటి మహోత్తమమగు సన్ని వేశములతో ఇతివృత్తనిర్వహణము గావించిన శ్రీ లక్ష్మినారాయణ పంతులుగారి ప్రతిభ నాబోటివాని వర్ణనమున కతీతమైన దనుట నిక్కము.

నాటకభాష - తదౌచిత్యము

సాధారణముగా గ్రంథకర్త లెంతటి యుత్కృష్టమగు ప్రతిభాసంపద గలవారై నను, అనురూపములగు భాషయును, భావమును అలవడినగాని రససిద్ధి నెనయజాలరు. కాని లక్ష్మీనారాయణపంతులు