పుట:Naajeevitayatrat021599mbp.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొక స్థానం ఖాళీ అయింది. ఆ స్థానానికి ఆ రోజులోనే ఇంగ్లండునించి తిరిగివచ్చి బళ్ళారిలో ప్లీడరీ చేస్తున్న కోలాచలం వెంకట్రావుగారు పోటీ చేశారు. కాకినాడలో ప్లీడరీ చేస్తూన్న కృత్తివెంటి పేర్రాజుగారు కూడా ఆ స్థానానికి నిలబడ్డారు. ఆయన సుబ్బారావు పంతులుగారి అభ్యర్థి. కోలాచలం వెంకట్రావుగారు అప్పుడే విదేశాలనించి తిరిగి వచ్చారని వ్రాశాను.

ఆ కాలంలో అల్లాంటి మనుష్యుల మీద మోజు ఎక్కువగా వుండడంచేత నే నాయనకి అనుకూలంగా పనిచేయడానికి నిశ్చయించాను. అందుచేత సుబ్బారావు పంతులుగారికి నామీద విపరీతమైన ఆగ్రహం కలిగింది. కృత్తివెంటి పేర్రాజుగారు నాకు కొద్దో గొప్పో బంధువర్గంలో వాడైనప్పటికీ, నేను రాజమహేంద్రపరంలోనే కాకుండా ఇతర గ్రామాలకి కూడా వెళ్ళి, వెంకట్రావుగారి తరఫున ప్రచారం చేశాను. వెంకట్రావు గారు గెలిచారు. క్పత్తివెంటి పేర్రాజుగారు ఓడిపోవడంతోనే సుబ్బారావు పంతులుగారు నన్ను ఏవిధంగానూ కూడాపైకి రానియ్యనని శపథం పట్టారు.

రామచంద్రరావుగారు రెండు సంవత్సరాలు మునిసిపాలిటీని పరిపాలించారు. ఆ తరవాత మళ్ళీ ఛైర్మన్ ఎన్నిక వచ్చింది. ఈ రెండు సంవత్సరాల్లోనూ ములుకుట్ల అచ్యుతరామయ్యగారు కౌన్సిల్లో ప్రవేశించారు. 1901 వ సంవత్సరంలో చైర్మన్ ఎన్నిక. అప్పుడు కౌన్సిలులో మార్కు హంటరు మెంబరు.

పి. టి. శ్రీనివాసయ్యంగారి తమ్ముడైన ఆరామదయ్యంగారు కూడా ఒక సభ్యుడు. ఆయన ఆలపాటి భాస్కర రామయ్యగారితో కలిపి కలప వ్యాపారం చేస్తూ, మొట్టమొదట రంపపు కోతమిల్లు పెట్టి నడిపించాడు, ఆయన నా పార్టీకి సంబంధించినవాడే. అంతవరకూ సుబ్బారావుపంతులుగారి వెనక వుండి ఓడిపోతూవచ్చిన కనపర్తి శ్రీరాములుగారు మా పార్టీ లో చేరి, నాతోబాటు కొన్సిలర్ అయ్యారు. రాయపూడి సుబ్బారాయుడు సంగతి చెప్పనే అక్కరలేదు కదా! నామినేటెడ్ సభ్యుల్లో కూడా చాలామంది నాకు సహాయకులుగా వుండేవారు.