పుట:Naajeevitayatrat021599mbp.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిళ్ళారిసెట్టి నారాయణరావు నాయుడుగారు కూడా కౌన్సిలరయ్యారు.

కౌన్సిల్లో బజులుల్లా సాహేబు సోదరుడు అజుముల్లా అని ఒక అతనువుండేవాడు. అతను అసిస్టెంటు ఇనస్పెక్టర్ ఆఫ్ స్కూల్సుగా పనిచేస్తూ వుండేవాడు. చాలా స్వతంత్రుడు. ఈ నాటి నామినేటడ్ మనుషుల్లాగ ఒట్టి డిటోగాడు కాడు. వెనక రైస్ రామచంద్రరావుగారిమీద పోటీ చెయ్యదలుచుకున్నప్పుడు కూడా అతను ఉద్యోగేతరుల తరపునే నిలబడ్డాడు.

మొత్తంమీద మా పార్టీ చాలా బలంగానే వుండింది. మోచర్ల రామచంద్రరావుగారు తమంతట తామే తప్పుకున్నారు. మా పార్టీ వారంతా నన్ను అభ్యర్థిగా నిర్ణయించారు. సుబ్బారావుపంతులుగారు నా మీద తీవ్రమైన కక్ష కట్టారని ఇదివరకే వ్రాశాను. ఆయన నేను ఛైర్మన్ కాకూడదని బ్రహ్మాండంగా పట్టుపట్టారు. అప్పట్లో ఉద్యోగస్థులంతా ఆయన పక్షాన్ని వుండేవారు. ఆ రోజుల్లో హెమ్నెట్ అనే ఆంగ్లో ఇండియన్ జిల్లాజడ్జీగా వుండేవాడు. ఆయన ఉద్యోగస్థు లందరితోటి నా మీద ఏవేవో చెప్పేవాడు. వాళ్ళకి నామీద బాగా అనిష్టం కలిగేటట్లు చేసేవాడు.

అయితే ఎన్నికలు సమీపించేసరికి, మార్కుహంటరు మొదలయిన ఉద్యోగస్థు లంతా నాకు అనుకూలం అయ్యారు. అప్పుడు సుబ్బారావుపంతులుగారు ములుకుట్ల అచ్యుతరామయ్యగారిని లేవదీశారు. పంతులుగారు చివరిదాకా నాకు సహాయం చేస్తానన్న సబ్‌కలెక్టరు విస్‌నీ, హంటర్‌నీ కూడా, జిల్లాజడ్జీచేత చెప్పించి, నాకు ప్రతికూలంగా తయారు చేశారు. ఇన్‌కంటాక్సు బూచిని చూపించి, నాకు అనుకూలంగా వుండే వైశ్య ప్రముఖుల్ని కూడా బెదిరించడానికి ప్రయత్నించారు. రాయపూడి సుబ్బారాయుడు అప్పులతో బాధపడుతూ వుండేవాడు. అతనికి అప్పు ఇస్తామని కూడా ఆశపెట్టారు. కాని, పని జరగలేదు. నన్ను ఓడించగలమనే ధైర్యంతో బ్యాలటుకూడా పెట్టించారు. కాని, చివరికి ఎంత చేసినా అసలు మార్కుహంటరు సబ్‌కలెక్టరు మీటింగుకి రానేలేదు.