పుట:Naajeevitayatrat021599mbp.pdf/900

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను ఆ విషయం దేబర్‌గారికి చెప్పి, ప్రకాశంగారికి ఒక తంతివార్త ఇప్పించాను. దాని సారాంశ మిది: "ఆంధ్ర పరిస్థితులు మేమంతా ఆలోచిస్తున్నాము మీరు తొందరపడి ఏ ప్రకటనా చేయవద్దని మా కోరిక,"

ప్రకాశంగారుకూడా కొంత సమాధాన పరచుకొని, తామిచ్చిన ప్రకటనలో, ప్రజలను రెచ్చగొట్టే వాక్యాలేవీ వ్రాయలేదు. కాని, అక్కడ ఢిల్లీలో దేబర్‌గారు, శాస్త్రిగారు వారు ఇదివరలో అన్నమాటలలో ఏ విధమైన మార్పుకీ అంగీకరించే ధోరణిలో లేరు.

గోపాలరెడ్డిగారి ముఖ్యమంత్రిత్వము

నాయకుని ఎన్నుకునే దినం ప్రకటింపబడింది. నాడు కాంగ్రెసు భవనం పరిసర ప్రాంతాలన్నీ ఒక పర్వదినపు రూపదర్శనం ఇచ్చినవి. బ్రహ్మాండమైన ఎన్నికల విజయం తర్వాత శాసనసభ్యులు సమావేశం కావడం అదే మొదలు.

దానికి రెండు రోజులుముందు సంజీవరెడ్డిగారు ఢిల్లీ వెళ్లారు. ఎన్నిక సమయానికి తిరిగివచ్చారు. ఆయన ఎన్నిక హాలులోకి ప్రవేశించక పూర్వంనుంచి, ఆయనకోసం ఎదురుచూస్తున్న నేను, ఆయనను ఎదుర్కొని, "మీరు గట్టిగా ఉండండి, మేమంతా ఉన్నాం గదా," అన్నాను.

ఆయన చెవులు ఈ మాటలువిన్నా, కళ్ళుమాత్రం పరధ్యానంగా ఉన్నట్టు నిశ్చయమయింది. ఆయన తొందరగా సభామందిరంలోకి వెళ్ళిపోయారు. కార్యక్రమం ప్రారంభించేసరికి, గోపాలరెడ్డిగారి పేరు వినబడేసరికే ఆయన అంగీకారం చూపించారు. ఆ పైన ప్రకాశంగారు, నేను చేయవలసింది ఏమీ లేకుండా పోయింది. గోపాలరెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యారు. పూర్వంలాగునే సంజీవరెడ్డిగారు ఉపముఖ్యమంత్రి అయ్యారు.

కొన్ని నెలల తర్వాత సంజీవరెడ్డిగారు విశాఖపట్నం రావడం జరిగింది. తంతి తపాలా శాఖకు సంబంధించిన ఏదో నూతన కార్యక్రమ ప్రారంభ సందర్భంలో ఆయన వచ్చారు. ఆ సభలో ఏదో