పుట:Naajeevitayatrat021599mbp.pdf/899

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను, ఆశ్చర్యంతో --- "నేను, ప్రకాశంగారితో మాట్లాడి, మీ దగ్గరికి తిరిగి వచ్చేవరకు ఏ పేరు సూచించబోము అని మాట ఇచ్చారుగదా!" అని అడిగాను.

శాస్త్రిగారు, "నిజమే! కాని, దేబర్‌జీ పేరు ప్రకటించేశారు," అని చెప్పి, ప్రకాశంగారి మంచం దగ్గరికి నడవ నారంభించేసరికి, దేబర్‌ గారుకూడా ఆ గదిలోకి వచ్చేశారు. వీ రిద్దరూ రావడంచూసి, ప్రకాశంగారు మంచంమీదనుంచి లేవబోతూంటే, దేబర్‌గారు, "మేము గోపాలరెడ్డిగారిని నాయకుడుగా, మీ పార్టీవారు ఎన్నుకోవాలని ప్రకటించేశాము. మీరు ఆయనకు మీ ఆశీర్వాదాలు ఇవ్వాలి," అని కొంత వినయంగానే అడిగారు.

ప్రకాశంగారు కనుబొమలు కొంచెం పై కెత్తి, తమకు స్వాభావికమైన మంద్రస్వరంలో, "మీరు గోపాలరెడ్డిగారి పేరు ప్రకటిస్తే, ఆయన ఎన్నికవుతాడు. నా ఆశీర్వాదాలు ఎందుకు?" అన్నారు.

దేబర్‌గారు గతుక్కు మన్నారు. నేను ఆయనను ఒక అడుగు అవతలికి తీసుకువెళ్ళి, "నేను వచ్చేవరకు ఏ పేరు చెప్పకుండా ఆగుతామన్న మీరు ఎందుకింత తొందరపడ్డారు?" అని అడిగాను.

ఆయన, "ప్రకటిస్తే ఏం ప్రమాదం?" అన్నారు.

నేను, "ప్రకాశంగారు ఎదురు తిరిగితే చాలా ఇబ్బందులు వస్తాయికదా!" అన్నాను.

ఆయన, "అయితే, మీరు ప్రకాశంగారిని కొంచెం సమాధాన పరచండి. మీరు ఢిల్లీకి రండి, అన్ని సంగతులు సమగ్రంగా చర్చించు కుందాము," అని నాతో అని, ప్రకాశంగారివైపు తిరిగి, "విశ్వనాథం గారు ఢిల్లీ వస్తారు. ఆయనతో అన్ని సంగతులు మాట్లాడుతాను. ఇప్పటికి సెలవు ఇవ్వండి," అనగానే - ప్రకాశంగారు ఏ మాటా అనకముందే, 'దండము' అని చెప్పి గదిలోంచి వెళ్ళిపోయారు.

శాస్త్రిగారుకూడా "సెలవు" అని చెప్పి వెళ్ళిపోయారు.

దేబర్‌గారు కోరినట్టు నేను ఢిల్లీ వెళ్ళాను. ఇంతట్లో విజయవాడలో, ఎవరి ప్రోద్బలంవల్లనో తెలియదుగాని, ప్రకాశంగారు అప్పుడున్న పరిస్థితులపై ఒక ప్రకటన చేయబోతున్నారని పత్రికలలోపడింది.