పుట:Naajeevitayatrat021599mbp.pdf/884

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందుచేత, ఈ రెండవ తీర్మానాన్ని వోటుకు పెట్టడానికి వీలులేదు అన్న అభ్యంతరంకూడా మరొక శాసన సభ్యులు సహేతుకంగా చెప్పి వాదించారు.

ఏ శాసన సభా చరిత్రలోను లేని విషయం అపుడు జరిగింది. 45 నిమిషాలు మా స్పీకరుగారు అక్కడ కూచునే ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ లోపున ఎవరికి తోచింది వారు, రెండువైపులా మాట్లాడడం మొదలుపెట్టారు.

ఈ ఆలస్యం అదను చూసుకొని ప్రతిపక్ష నాయకులు, మా పక్షంలో ఉన్న నలుగురు సభ్యులను ఒకరి తర్వాత ఒకరిని చీడిలోకి తీసుకువెళ్ళి, చతురోపాయములని చెప్పిన వాటిలో రెండు, మూడు ఉపాయాలను అవలంభిస్తూన్నట్టు మాలో కొందరు కనిపెట్టారు. కాని, ఆ పరిస్థితులలో ఎవరూ ఏమీ చేయగలిగింది లేదు.

కాంగ్రెసు పార్టీలో ఉన్న ఒకరు లేచి, "మాకు ప్రభుత్వంమీద ఏమీ కోపంలేదు. కాని, సంజీవరెడ్డిగారి అహంభావానికి మా తిరస్కారం తెలియజేయడానికి విశ్వాస రాహిత్య తీర్మానానికి అనుకూలంగా తాను వోటు చేస్తున్నట్టు ప్రకటించాడు.[1]

మరి ముగ్గురు సభ్యులు, మొదటి తీర్మానానికి ప్రభుత్వ పక్షన వోటు చేసిన వారు, అయినా, ఈ రెండవ తీర్మానానికి ప్రతిపక్షానికి అనుకూలంగా వోటు చేశారు.

ఏడు వోట్లతో మొదటి తీర్మానంలో గెల్చిన ప్రభుత్వం, ఈ రెండవ తీర్మానంలో ఒక వోటుతో ఓటమి చెందింది.

ఆంధ్రరాష్ట్ర ప్రథమ ప్రభుత్వం పతనమైంది.

ప్రకాశంగారు - కొన్నాళ్ళ క్రిందట, ఎప్పుడైనా ఓడవలసి వస్తే స్పీకరుగారి తప్పుడు రూలింగు వల్లన్నే ఓడిపోతామని హాస్యధోరణిలో చెప్పిన జోష్యం నిజమైంది.

ప్రతిపక్షం వారి ముఖాలు వికసించాయి. అంతకన్న హెచ్చుగా

  1. ఆ 13 నెలలలోను, ఆయన - నలుగురూ వినేలాగు మాట్లాడింది అదే ప్రథమం అనుకుంటాను.