పుట:Naajeevitayatrat021599mbp.pdf/885

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గవర్నరు త్రివేదిగారి ముఖం వికసించిందని వెంటనే చూసినవారు చెప్పారు.

ప్రతిపక్షుల బలంవల్ల కాకపోయినా, నలుగురు స్వపక్షీయుల దొంగపోటువల్ల, అనుకోడానికి వీలులేని క్షణంలో, ప్రభుత్వం పతనమయింది.

ఈ సంఘటన జరిగిన తర్వాత, మంత్రిమండలి ప్రకాశంగారి యింట్లో సమావేశ మయింది. ఆ సమావేశంలో తీర్మాన పూర్వకంగా గవర్నరు గారికి ఒక లేఖ వ్రాశాము: "ఈ రోజున, శాసన సభలో - మా ప్రభుత్వంపైని, విశ్వాస రాహిత్య తీర్మానం ఒకటి ఆమోదింపబడింది. అందుచేత, ఇందుమూలంగా వెంటనే మా ప్రభుత్వం రాజీనామా దాఖలు చేస్తున్నది. ప్రస్తుతం శాసన సభలో వివిధ పార్టీల సంఖ్యాబలం బట్టి చూస్తే, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడ గలిగే పరిస్థితులు లేవు. అందుచేత, శాసన సభ రద్దుచేసి, త్వరలో క్రొత్త ఎన్నికలు జరిపించవలసిందని మా సలహా. మా రాజీనామా, మా సలహా అంగీకరించవలసిందని మా కోరిక."

ప్రకాశంగారు ఈ ఉత్తరంమీద సంతకం పెట్టి, సంజీవరెడ్డిగారి చేతికిచ్చి, ఆయనను స్వయంగా వెళ్ళి గవర్నరుకు అందజేయమని కోరారు. ఆయన వెంటనే గవర్నరు దగ్గరికి వెళ్ళి, ఆ లేఖ అందజేశారు. విశ్వాస రాహిత్య తీర్మానం రెండుగంటల తర్వాత పాసయినట్టు జ్ఞాపకము. మా రాజీనామా 5 గంటల లోపునే పంపించేశాము.

నేను ఇంటికి వెళ్ళేసరికి, మాకు వ్యతిరేకంగా ఉన్నవారిలో కొందరు వచ్చి, "ఎవరూ అనుకోని దుష్ఫలితం ప్రాప్తించింది. మీరు రాజీనామా ఉపసంహరించవలసింది. మేము, మీ ప్రభుత్వాన్ని బలపరుస్తా"మని చెప్పారు.

కాని, వారి అభిమానానికి కృతజ్ఞత తెల్పి, "ఉపసంహరించే లక్షణం మంత్రివర్గంలో ఎవరికీ లేదు. ప్రకాశంగారికి అసలే అటువంటి భావం ఉండదు. మీరు మాకు నచ్చజెప్పే ప్రయత్నం మానుకోండి," అన్నాను.