పుట:Naajeevitayatrat021599mbp.pdf/883

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చర్చ చాలాసేపు జరిగింది. ప్రతిపక్షంవారు, ప్రభుత్వంపైన చేసే విమర్శలు అలవాటైన పద్ధతిలోనే ఆరంభమయ్యాయి. వోటింగు సమయం వచ్చేసరికి మళ్ళీ పాత చర్చ రెండు తీర్మానాలు ప్రత్యేకంగా వోటుకి పెట్టాలని ప్రతిపక్షంవారు, అలాగు వీలులేదని నేను వాదించుకోవడంలో కాలం వృథా అయిపోయింది.

"ఏ తీర్మానం ముందు వోటుకి పెట్టాలి?" అని స్పీకరుగారు నన్నడగగా - అది ప్రతిపక్షంవారికే మేము వదిలి పెట్టేశా మని, ప్రభుత్వ పక్షాన నేను చెప్పాను.

రెండు తీర్మానాలనూ ప్రతిపాదించినవారు, పైన పేర్కొన్న వాటిలో మొదటి దానిని వోటుకి పెట్టాలని అడిగారు.

ఆ మొదటి తీర్మానం సూటిగా ఉంది; అన్ని కారణాలు అందులోనే లీనమై ఉన్నవి.

వోట్లు లెక్కించగా ప్రభుత్వానికి 7 వోట్లు మెజరిటీ వచ్చింది. విశ్వాసరాహిత్య తీర్మానం ఓటమి చెందింది.

స్పీకరుగారు ఎజెండాలో ఉన్న తర్వాత అంశానికి వెళ్ళడమో, లేక సభ వాయిదా వేయడమో చేయవలసి ఉంది. ప్రతిపక్షంవారు, స్పీకరు వైఖరి తెలిసినవారు కాబట్టి రెండవ తీర్మానం వోటుకు పెట్టాలని కేకలు వేశారు - అది ఎంతమాత్రం చెల్లదని మేము ప్రభుత్వపక్షాన వాదించాము. ఓడిపోయినది - రెండవ తీర్మానంకన్నా బలమైనది; హెచ్చు విస్తారత కలది అన్నది న్యాయశాస్త్ర ప్రతిపాదితమైన సూత్రము.

అ కారణమే వారికి బలీయమని తోచిన యెడల - వారు, మొదటిదానికి రెండవదానిలో ఉన్న మాటలు సవరణగా ప్రతిపాదించి ఉండవలసింది కాని వారలా చేయలేదు. ఇంతేకాక, ఈ సమావేశం (సెషన్)లోనే - ఈ కారణం చెప్పి, గవర్నరు సంబోధనోపన్యాసానికి చేసే కృతజ్ఞతా తీర్మానంలో, 'రామమూర్తి కమిటీ సిఫార్సులు అమలుపరచలేదు కనుక చింతిస్తున్నా' మన్నమాట చేర్చాలని వారు సవరణ సూచించడము, అది ఓడిపోవడము కూడా జరిగినవి.