పుట:Naajeevitayatrat021599mbp.pdf/880

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వినియోగం కాన్ట్సిట్యూషనల్ గవర్నరు అనే ఉండాలని నా అభిప్రాయంగా చెప్పాను.

దానికి ఆయన - బొంబాయిలో మంత్రివర్గ ప్రమేయం లేకుండా, గవర్నరు నామినేషన్లు చేస్తున్నాడని, 'లా' సెక్రటరీ ఇచ్చిన నివేదికలో ఉన్నదని నాకు చూపించాడు. దానికి నేను "ఈ రాష్ట్రం, మద్రాసు రాష్ట్రంలోంచి విభజన అయివచ్చింది. మద్రాసు రాష్ట్రంలో, లోగడ మీ స్థానంలో ఉన్నవారు, అనగా గవర్నరుగారు పెట్టిన సంప్రదాయంకూడా చూడండి. యుద్ధసమయంలో 'హోప్‌' అనే గవర్నరు ఉండేవాడు. నామినేషన్ల విషయమై, ఆయనకు స్వయంగా చేసుకునే హక్కు ఉఅందా? లేక మంత్రులున్నట్లయితే, మంత్రుల సలహాపైన చేయాలా? అనే సమస్య చర్చిస్తూ, ఒక పెద్ద ఫైలు ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆ నాటికి దేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. ప్రస్తుత సంవిధానం తయారు కాలేదు. అయినప్పటీకి ఆయన, 'ఈ చర్చతో నాకు సంబంధం లేదు. మంత్రులుంటే, మంత్రి చెప్పిన సలహాపైనే నేను నడచుకొంటాను,' అని వ్రాశాడు. అది మీరు చూడండి," అని ఆ విషయం గవర్నరు దృష్టికి తెచ్చాను.

ఇది - గవర్నరు ప్రతివిషయంలోనూ తనకే అధికారం కావాలి అనే భావంలో ఉండేవాడనడానికి ఉదాహరణగా వ్రాశాను.

ఆయన ఇంతకన్నా ప్రమాదకరమైన పని ఇంకోటి చేశాడు. హైకోర్టులో అదనంగా జడ్జీలను వేయవలసిన అవసరం వచ్చింది. గవర్నరు - జడ్జీ నియామకం ఫైలులో ముఖ్య న్యాయమూర్తి సూచించిన పేరుగాని, ముఖ్యమంత్రి సూచించిన పేరుగాని, తనకు అంగీకారం కాకపోతే, తాను సూచించే పేరు వ్రాయడం తప్ప, వేరే చర్చలు చేయడానికిగాని, తాను స్వయంగా వేరే ఫైలు ప్రారంభించడానికిగాని కార్య నిబంధనలు ఒప్పుకోవు.

అయినప్పటికీ, ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆ విషయమై, ఒక ప్రత్యేక ఫైలు ఆరంభించడమూ, సచివాలయంలో - అది, ముఖ్యమంత్రిగారికి వచ్చిన ఫైలుతో సంబంధంలేకుండా నడవడమూ జరింది.