పుట:Naajeevitayatrat021599mbp.pdf/865

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశంగారు, నేను - భట్నగర్‌గారి యింటికివెళ్ళి, ఈ బిల్లు విషయం ఎత్తేసరికి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎందుకూ పనికిరానిదని, అనేక చిల్లరమల్లర దోషారోపణలు చేశారు.

అపుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన సూచించిన దోషాలు సవరిస్తాము కాని, మేము వచ్చింది క్రొత్త విశ్వవిద్యాలయ విషయంగానని చెప్పాము.

దానిమీద, ఆయన చెప్పిందే మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. విశ్వవిద్యాలయంలో సైన్సు లేబరేటరీలు ఏ విధంగా ఏర్పాటు చేయాలో వర్ణించసాగాడు.

విశ్వవిద్యాలయం స్థాపించడానికి అనుమతిస్తేనే కదా కట్టడముల విషయం వస్తుందని మే మన్నాము. కాని, ఆయన - కట్టడాల విషయమై నిశ్చయం కానిదే, తాను విజ్ఞాన సలహాదారుగా ఉన్నంతకాలం అనుమతించడం ఎలా గని వాదించారు.

అది అప్పుడప్పుడే చీకటిపడుతున్న సమయము. ఆయన ధోరణి ఆయనదే. కాని, మాకు ఒక ధ్వనిమాత్రం కనిపించింది. [1] ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు తన్ను గుర్తించలేదని ఆయన మనసులో ఒక బాధ వున్నట్టు గుర్తించాము.

  1. భట్నగర్ గారి సంభాషణలో మేము కనిపెట్టిన ధ్వని, విశాఖపట్నం వచ్చినప్పుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కృష్ణగారికి తెలియజేశాను. ఢిల్లీలో జరిగిన ఒక కాన్ఫరెన్సులో తాను కూడా అది గుర్తించినట్టు చెప్పి, భట్నగర్ గారిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒక మారు స్నాతకోత్సవంలో కాన్వోకేషన్ అడ్రస్ ఈయవలసిందని పిలిస్తే వ్యవహారం చక్కబడవచ్చన్నారు. ఆహ్వానించగానే, కృష్ణగారు అనుకున్నట్టుగానే భట్నగర్ గారు దృష్టి మార్చుకొన్నారు. అయితే, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆ కాన్వొకేషన్ రోజున పెద్ద వర్షం పడి, ఆహ్వానితు లందరూ, వేదికపై ఉన్నవారితో సహా తడిసేపోయారు. ఆ నాటి శైత్యం 'న్యుమోనియా' వంటి జబ్బుగా మారి, దేశంలోగల పెద్ద విజ్ఞాన శాస్త్రవేత్త అయిన ఆయన అసువులు బాశారు.