పుట:Naajeevitayatrat021599mbp.pdf/864

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పాను. ఆయన నన్ను హుమయూన్ కబీర్‌గారితో మాట్లాడవలసిందని చెప్పారు.

అప్పట్లో హుమయూన్ కబీర్‌గారు కేంద్ర విద్యామంత్రి అయిన అజాద్‌గారికి విద్యాశాఖలో కార్యదర్శిగా ఉండేవారు.[1]

కట్జూగారితో, "నేను, ప్రకాశంగారు అంతకుముందు అజాద్‌గారితో ఈ విశ్వవిద్యాలయ విషయమై మాట్లాడినప్పుడు ఆయన అనుమతించారు. మ రిప్పుడాయన విదేశాలలో పర్యటిస్తున్నారు కదా! ఎలాగా?" అన్నాను.

అందుకు, కట్జూగారు మళ్ళీ ఇలా అన్నారు: "అజాద్‌గారి అనుమతి ఒక అనుమతి కాదయ్యా! కబీరుగారిని ఒకసారి చూడు."

కబీరుగారు 1930 ప్రాంతాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేసివున్నారు. కాని, అప్పటికి ఆయనతో నాకు ప్రత్యేకంగా పరిచయం లేదు. అందుచేత, అప్పుడు మంత్రిగావున్న గిరిగారితో, "కబీరుని కలుసుకోవాలి. ఆయనకు నేను వస్తున్నానని ఒక మారు చెప్పండి," అన్నాను.

ఆయన "కబీరు మనకు బాగా తెలిసినవాడే. నేనే స్వయంగా తీసుకువెళతాను," అని, నాతోబాటు కబీరుదగ్గరికి వచ్చారు.

కబీరు, బ్రహ్మాండంగా సంతోషించి, "డాక్టర్ భట్నగర్‌గారు చాలా అభ్యంతరం చెప్తున్నారు - అవి పరిశీలిస్తున్నాను," అన్నారు.

నే నప్పుడు - ప్రకాశంగారికీ, భట్నగర్‌గారికీ ఈ బిల్లు విషయంలో అంతకు వారంరోజులక్రింద జరిగిన చర్చ సంగతి చెప్పాను. ఆ చర్చ జరిగినపుడు నేనుకూడా వున్నాను.

  1. అజాద్ గారి మరణానంతరం ఈయన రాజకీయ రంగంలోకి దిగారు. 1967 లో నాతోపాటు, పార్లమెంటులో నా గ్రూపులో సహచరులుగా ఉండేవారు. అయితే, ఆనాడు పశ్చిమ బెంగాలులో కలిగిన రాజకీయపు సుడిగాలులతో త్రోవలు తప్పి, తర్వాత ఎవరూ అనుకోకుండా మరణించారు. ఈయన విద్వాంసుడు; ఆంగ్ల, బంగ్లా భాషలలో కవిత్వ రచన చేసినవారు.