పుట:Naajeevitayatrat021599mbp.pdf/866

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భట్నగర్‌గారితో, ఆయన చెప్పినదంతా చేస్తామని చెప్పి వచ్చేశాము.

ఇదంతా కబీరుగారికి చెప్పి, నేను ఇంకా మరొకటి చేశాను.

మన సంవిధానం ప్రకారంగా విశ్వవిద్యాలయాల సంస్థాపన రాష్ట్రప్రభుత్వాల హక్కు కాగా, విశ్వవిద్యాలయాలలో జరిపించే వైజ్ఞానిక, సాంకేతిక పరిశోధనా విషయాలను, ఉన్నతవిద్యల ప్రమాణాలను నిర్ణయించడం మాత్రం కేంద్రప్రభుత్వం హక్కు అని, సంవిధానం 7 వ షెడ్యూలు, యూనియన్ లిస్టులో గల 66 వ ఖండమూ, స్టేట్ లిస్టులో గల 11, 32 ఖండాలూ ఆయనకు చూపించి బోధపరచగా, "అవును. శాసనం ఆమోదించే సందర్భంలో మా ప్రమేయమేమీ లేదు. ఒప్పుకున్నాను," అన్నారు.

దానిమీద నేను ఆయనకు ఫైలు చూపిస్తూ, "ఇంత ఫైలు ఎందుకు పెంచారు?" అని అడిగాను.

ఆయన "ఫైలు నా టేబిల్‌మీదికి వచ్చింది. అందుచేత నేను వ్రాస్తున్నాను," అన్నారు.

"అయితే అనుమతించడానికి మీ అభ్యంతరం లేదని వెంటనే వ్రాయండి," అన్నాను.

ఆయన ఆ విధంగా వ్రాసుకోగా, హోమ్ సెక్రటరీకి ఆ విషయం కొంత తెలియజేయమన్నాను. ఆయన వెంటనే ఆ పని చేశారు.

తరువాత కట్జూగారి దగ్గరికి వెళ్ళితే, ఆయన సెక్రటరీని పిలిచి అడిగారు. ఆయన వచ్చి, లా డిపార్ట్‌మెంట్‌వారి అడ్డు ఇంకా ఉందని చెప్పారు.

వారు చూపిన అడ్డు ఇది: "దేవస్థానం డబ్బు హిందూమతానికి సంబంధించని విద్యపై ఖర్చుపెట్టవచ్చునా?" దానిపై వారు ఆలోచిస్తున్నారట.

'లా' సెక్రటరీతో చర్చిస్తే, ఈ విషయంలో ఆయన గట్టిగా పట్టు పట్టాడు. ఆయనతో నేను చెప్పినదాని సారాంశ మిది: "ఈ శాసనం ప్రకారం, ఇదివరకు అనేక సంవత్సరాలుగా అదే దేవస్థానం