పుట:Naajeevitayatrat021599mbp.pdf/838

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంకట్రామయ్యా! మా ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోతే, నీ రూలింగుల వల్లనే పడిపోతుందిలే!" అన్నారు.

దీనిపై స్పీకరుగారు, ఆ మాటలు విన్న అంతమందీ గొల్లున నవ్వారు.

కాని, నిజానికి మరి పదకొండు నెలల తర్వాత, ప్రకాశం ప్రభుత్వంపై వచ్చిన విశ్వాసరాహిత్య తీర్మానంపైన జరిగిన చర్చలు, ఆ రోజున స్పీకరు ఇచ్చిన పరస్పర విరుద్ధమయిన రూలింగులు చదివినట్టయితే, ప్రకాశంగారన్నట్లు పైన పేర్కొన్న మాటలు భవిష్యత్సూచకములైన మాటలని తెలియగలదు.

ప్రకాశంగారు ఒక్కొక్కప్పుడు డొంకతిరుగుడుగా మాట్లాడేటట్టు కనిపించేవారు. కాని, అది ఆయన బుద్ధిపూర్వకంగానే మాట్లాడే విధానము. ప్రభుత్వమేమి చేసినా అభ్యంతరము చెప్పే ప్రతిపక్షం ఎదురుగా కూచున్నప్పుడు, వారి మనసు తిరగడానికి అటువంటి విధాన మవలంబించేవారు.

ఆ సమయంలో నిల్చుని మాట్లాడవలసిన ముఖ్య మంత్రి మనస్థితీ, ముందుగానే మనసులో ఒక తీర్పు నిర్ణయించుకొన్న హైకోర్టు జడ్జీముందు వాదించే న్యాయవాది మనస్థితీ, పద్ధతీ ఒకే విధంగా ఉంటాయి.

విషయానికి సంబంధించకుండా, విషయానికీ మరీ దూరంగా పోకుండా - సర్వజనాంగీకారమైన కొన్ని మాటలతో ప్రారంభించి, మెల్లిగా ప్రతిపక్షుల ముఖ వైఖరిలో కొంచెం మార్పు కలిగిన తర్వాత అసలు విషయంలోకి దిగాలి.

అటువంటి సమయాలలోనే ప్రకాశంగారు కొంచెం డొంక తిరుగుడుగా మాట్లాడేవారు.

కర్నూలు శాసన సభలో ఉన్న ప్రతిపక్షులు ఏకంగా మాట్లాడేవారు చాలామంది ఉండేవారు. కాని వారు కార్య నిబంధనలతో అట్టే సంబంధం పెట్టుకొనేవారు కారు. వారు గట్టిగా మాట్లాడితే, స్పీకరు వెంటనే మెత్తబడుతూండేవారు. అందుచేత అడ్డు, ఆపులేని వారి విజృం