పుట:Naajeevitayatrat021599mbp.pdf/827

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రొత్త రాష్త్రానికి ఎంతమంది ఐ.పి.ఎస్., ఐ.ఏ.ఎస్. ఉద్యోగులు ఉండవలెనో సూచిస్తూ, వారి పేర్లతో సహా మా సలహా సంఘంతో ప్రమేయం లేకుండానే ఏర్పాట్లు చేశారు. ఇక మేము చేయవలసిన పని - మిగతా శాఖలలో సీనియారిటీని బట్టి ఉద్యోగులను అన్నిశాఖలకు ఎన్నుకోవడము; వారు ఒప్పుకోకపోయినా, లేక చెన్నరాష్ట్ర ప్రభుత్వంవారు వారిని విడుదల చేయము అన్నా మరి ఒకరిని ఎన్నుకోవడము.

ఈ యత్నంలో, సహజంగా తెలుగు ఉద్యోగస్థులు పెద్దా చిన్నా యావన్మంది కూడా ఆంధ్ర రాష్ట్రానికి కేటాయింపు అయ్యారు.

క్రొత్త హైకోర్టు ఆంధ్రలో పెట్టడానికి నిర్ణయించలేదు గనుక, హైకోర్టు విభజన విషయమై మేమేమీ చేయవలసిన పని లేకపోయింది.

ఆంధ్రదేశానికి, మిగులు చెన్న రాష్ట్రానికి మధ్య విభజించిన గవర్నమెంటు పరిశ్రమలు, అప్పులు - ఆస్తుల పట్టీలు అన్నీ ఇదివరలోనే తయారయిపోయి ఉండడంవల్ల, ఆంధ్రరాష్ట్ర శాసనం ఆలస్యం కాకుండా ఢిల్లీ శాసన సభలో పాసయింది.

ఉద్యోగుల విభజనేగాక, రికార్డులన్నీ విభజించాలి. సచివాలయ గ్రంథాలయం విభజించాలి. ఉద్యోగులతో బాటు రావలసిన కుర్చీలు, బల్లలు వగైరాలు విభజించాలి. వీటికి తగిన సూత్రాలన్నీ మేము సలహా సంఘంలో వ్రాస్తూ ఉంటే, ప్రభుత్వం తదనుగుణంగా ఆర్డర్లు జారీ చేయాలని ఏర్పాటు.

సెప్టంబరు 1 న, మా ఉప సంఘం పని, ఫోర్టు సెంటుజార్జి సచివాలయంలో గవర్నరుకు ఏర్పాటుచేసిన గదిలో ప్రారంభించాము.

ఎవరో కొందరు తెలుగు ఉద్యోగులు మాత్రమే చెన్నరాష్ట్రం క్రిందే ఉండిపోతామని ఉండిపోయారు. ఐ.పి.ఎస్; ఐ.ఏ.ఎస్. ల జాబితాలో తెలుగువారు తక్కువమందే ఉండిరి. ఐ.పి.ఎస్., ఉద్యోగులు ముగ్గురే ఉన్నట్టు జ్ఞాపకము. ఇతర రాష్ట్రాలలో పెద్ద ఉద్యోగాలలో ఉన్న కొందరిని ఆంధ్రరాష్ట్రంలోకి తీసుకురావడానికి యత్నించాము. కానీ, ఆ ప్రభుత్వాలు అంగీకరించలేదు.