పుట:Naajeevitayatrat021599mbp.pdf/828

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సందర్భంలో ఒక ముచ్చట చెప్పాలి. బొంబాయిలో పి. డబ్ల్యూ. డి. నీటిపారుదల చీఫ్ ఇంజినీరు ఆంధ్రుడు. ఆలిండియా ఇంజనీరింగ్ శాఖకు చెందినవాడు. ఆయనను ఆంధ్రరాష్ట్రానికి ఇవ్వవలసినదని, బొంబాయి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయిగారిని మేము కోరాము. త్రివేదిగారు - మా సంఘానికి అధ్యక్షులు గనుక, కాబోయే గవర్నరు గనుక ఆ చీఫ్ ఇంజనీరును మాకు ఇవ్వవలసిందని కోరగా, వారు 'తెలుగు రాజ్యానికి తెలుగువాడే ఉండాలని ఎందుకు మీకు పట్టుదల?' అంటూ నిరాకరించారు.

డాక్టర్ కె. ఎల్. రావుగారు ఢిల్లీలో పెద్ద ఉద్యోగములో ఉన్నప్పటికీ, ఆలిండియా ఇంజనీరింగ్ శాఖకు చెందినవాడు కాడు గనుక, తెలుగు రాష్ట్రానికి చీఫ్ ఇంజనీరుగా తీసుకొనేందుకు వీలు లేదన్నారు.

చివరికి చెన్నపట్నంలో చీఫ్ ఇంజనీరుగా పదవీ విరమణ చేసి, విశ్రాంతి తీసుకొంటున్న ఎల్. వెంకటకృష్ణయ్యగారిని చీఫ్ ఇంజనీరుగా కాంట్రాక్టుపైన తీసుకోవలసి వచ్చింది.

మనకు అనేక శాఖలకు అధిపతులుగా (హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్) ఉండడానికి అర్హతకలిగినవారు లేకపోవడం జరిగింది.

ఇక్కడి ఉద్యోగాల విషయమై ఈ పనులు చేస్తూ, కర్నూలులో అక్టోబరు 1 నాటికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఉద్యోగులను నియమించడం జరిగింది.

కర్నూలులో వసతులు కల్పించడానికి, అవసరమైనచోట్ల రోడ్లు వేయించడానికి, వెడల్పు చేయించడానికి, ఎలక్ట్రిక్ సప్లయి చేయించడానికి, మంచినీటి సరఫరా చేయించడానికి, సచివాలయం పెట్టడానికి అనువుగా కర్నూలు కలెక్టరు ఆఫీసు భవనంలో తగిన మార్పులు చేర్పులు చేయడానికీ, పెద్ద ఉద్యోగులకు వసతి గృహాలు, సచివాలయంలో పనిచేసే అన్ని తరగతులవారికి భవనాలు, అవి కుదరనిచోట డేరాలు నిర్మించడానికి నలభై లక్షల రూపాయలు మంజూరు చేశారు.