పుట:Naajeevitayatrat021599mbp.pdf/826

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నప్పటికీ ఆయనమీద వ్యక్తిగతంగా ఉన్న గౌరవంచేత, ఆంధ్రరాష్ట్ర మవతరిస్తున్నదన్న ఆత్మతృప్తిచేత పార్టీలో ఉన్నవారు అట్టే గలభా చేయలేదు.

కాంగ్రెసుకు ప్రత్నామ్నాయపక్షంగా ఉండి, ప్రజాస్వామ్యంపై నమ్మకంగల పెద్ద పార్టీ దీనితో క్షీణదశకు వచ్చింది. ఇంతేగాక, మరి కొంతకాలానికి ప్రజాపార్టీతో కలిసిన సోషలిస్టులు విడిపోయి కాంగ్రెసుతో కలసిపోవడంవల్ల మొదటి కె.ఎమ్. ప్రజాపార్టీ వారెవరో, వారు మాత్రం మిగిలారు. 1956 వరకు, వారికి మంత్రివర్గంలో ఒక స్థాన ముండేది. ఇపు డదికూడా లేక పార్టీ నామమాత్రావశిష్టమైంది.

అయినా, అందులో - సత్యాహింసలపైన పూర్తి నమ్మకం గలవారు, ప్రకాశంగారిలాగే దేశముకోసం త్యాగం చేసినవారు ఆయన వలెనే స్వయంపోషక గ్రామ స్వరాజ్య ప్రాతిపదికపై దేశ శాంతి, సామ్యస్థితి, మానవతాగౌరవములను సంస్థాపన చేయడంలో నమ్మకమున్నవారు ఉండడంవల్ల, గౌరవంగా, నిరాడంబరంగా రాజకీయ రంగంలో మిగిలి ఉంది.

ఇక ప్రస్తుత విషయము:

ఆంధ్రరాష్ట్రానికి కావలసిన ముఖ్యమంత్రిత్వము ప్రకాశంగారికి చేకూరగా, కాంగ్రెసు తరపున సంజీవరెడ్డిగారికి ఉప ముఖ్య మంత్రిత్వము డిల్లీలో తెరవెనుకనే ఏర్పాటయింది.

తరువాత, వేయవలసిన అడుగులు తొందరగానే పడ్డాయి. సంజీవరెడ్డిగారు, గౌతులచ్చన్నగారు, ప్రకాశంగారి వంతున నేను ఉన్న ఒక చిన్న ఉప సంఘాన్ని, పంజాబు గవర్నరుగా పనిచేసి విశ్రాంతి తీసుకొంటున్న సి.ఎమ్. త్రివేదిగారి అధ్యక్షత క్రింద నెహ్రూగారు నియమించారు.

మాకు కార్యదర్శులుగా పనిచేయడానికి, ఇద్దరు ఐ.సి.ఎస్. ఉద్యోగులను ఇవ్వవలసిందని చెన్నరాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. దానిపై ఓ. పుల్లారెడ్డి, వి.కె. రావు గారలనే ఐ.సి.ఎస్. ఉద్యోగులను మా ఉప సంఘానికి కార్యదర్శులుగా నియమించారు.