పుట:Naajeevitayatrat021599mbp.pdf/821

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమావేశ సభ్యులకు చూపించి, ప్రచారాలు చేసుకో నారంభించారు.

ఉదయం ప్రకాశంగారి యింటిలో జరిగిన సమావేశంలో దీర్ఘమైన చర్చ జరిగింది.

విశాఖపట్నం విషయమై నేను ఆ సభలో ఉండడము మిగిలిన జిల్లాల సభ్యుల నందరినీ ఏకంచేసి, "మీకు హార్బరు ఉంది. షిప్ యార్డు ఉంది. ఈ విషయంలో మీరు విశాఖపట్నం పేరు చెబితే మేము ఒప్పుకొనేది లేదు," అని వారు చెప్పడానికి కారణమైనది.

రాయలసీమకు, శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం తాత్కాలిక రాజధాని యివ్వవలసిందే. అది, తిరుపతిలో ఉన్నట్లయితే చిత్తూరు జిల్లా మనతో కలసి వస్తుందనీ, లేకుంటే కలిసిరాదని తిరుపతిలోగల భవనాల బొమ్మలు చూపుతూ మిత్రులు గౌతు లచ్చన్నగారు వాదించారు.

కడపలోగల భవనాల చిత్రాలు చూపుతూ, కె. కోటిరెడ్డిగారు చాలాసేపు చెప్పారు.

తాత్కాలిక రాజధాని యిచ్చినంత మాత్రాన రాయలసీమకు ఒరిగేది ఏమీ లేదు గనుక, దానిని గుంటూరు - బెజవాడ మధ్య ఉంచాలని కమ్యూనిస్టులు వాదించారు.

రాష్ట్రం ఏర్పాటులో ఒక విధమైన ప్రధానపాత్ర వహించడంవల్ల, సంజీవరెడ్డిగారు - అనంతపురం, రాయలసీమ ప్రాంతాలలో కొంచెం సమ శీతోష్ణ వాతావరణం గల స్థలమయినా, తాను ఆ విషయం ప్రచారం చేసుకోవడం భావ్యం కాదని ఊరుకున్నారు. దానికి తోడుగా, అనంతపురం విషయమై ప్రసక్తి వచ్చినపుడు, ప్రకాశంగారు "సంజీవరెడ్డి అనంతపురం విషయమై ప్రచారం చేసుకోడులేండి" అని, సంజీవరెడ్డిగారికి ఒకవేళ మాట్లాడుదామన్నా అవకాశం ఇవ్వలేదు.

ఆలాగుననే విశాఖపట్నం విషయమై, "విశాఖపట్నంకోసం వేరేప్రచార మెందుకయ్యా?" అని అట్టే చర్చ అక్కరలేకుండానే వదిలి పెట్టారు.

చివరికి ఒంటిగంట అయినా, ఏ నిర్ణయానికీ రాలేకపోయాము. ఇక నిర్ణయానికి రాలేము అన్న భావం ఒకటి మా అందరికీ కలిగింది.