పుట:Naajeevitayatrat021599mbp.pdf/820

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బయటపడిన నెలరోజుల దగ్గరినుంచి, అన్ని జిల్లాలలోను ఈ తాత్కాలిక రాజధాని 'మా పట్నంలో, ఉండాలంటే - మా పట్నంలో ఉండాలి' అన్న తీవ్రమైన వాగ్వివాదాలు బయలుదేరాయి.

సహజంగా ప్రకృతి సౌందర్యాన్నిబట్టి, ఉండే సౌకర్యాలనుబట్టి విశాఖపట్నం అనువైన స్థలమని విశాఖపట్నం శాసన సభ్యులమంతా అనుకొన్నాము.

గోదావరి జిల్లాల ప్రసక్తి, రాలేదు.

కృష్ణా, గుంటూరు జిల్లాలు కమ్యూనిస్టు సభ్యుల సంఖ్య హెచ్చుగా ఉన్న జిల్లాలు గనుక, తాత్కాలిక రాజధాని ఆ ప్రాంతంలో ఉండాలనీ, అది విజయవాడ - గుంటూరుల మధ్య ఎక్కడో ఏర్పాటు కావాలనీ - కమ్యూనిస్టులు అతి తీవ్రమైన ప్రచారం లేవదీశారు.

సంజీవరెడ్డిగారు మాట్లాడడంలో అప్పుడు ఎంతో ఆత్మనిగ్రహం కనబరిచారు. అయితే, రాయలసీమ సభ్యులలో, కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఒక రిద్దరు తప్ప మిగిలినవా రంతా - 1938 లో సర్కారు జిల్లాల వారికీ, రాయలసీమ జిల్లాల వారికి జరిగిన ఒడంబడిక ప్రకారం ఆంధ్రా యూనివర్శిటీ కోస్తా జిల్లాలలో ఏర్పాటయింది గనుక, తాత్కాలిక రాజధాని అయినా రాయలసీమలో ఏర్పాటు కావాలనీ, అలా కాకుంటే తాము చెన్నరాష్ట్రంలోనే ఉండిపోతామనీ దాదాపు అందరూ సంతకం పెట్టిన కాగితం జేబులో పెట్టుకుని, సమయం వస్తే సభలో చదవడానికి సిద్దమై కూచున్నారు.

లోగడ, వీరు విద్యా విషయంలో ఆంధ్రా యూనివర్శిటీ యాజమాన్యం ఒప్పుకోమని మద్రాసు యూనివర్శిటీ యాజమాన్యంలో ఉండిపోయిన విషయం పాఠకులకు తెలిసే ఉంటుంది. ప్రాంతీయాభిమానాలు చాలా బలీయము లైనవి కదా!

ఈ పరిస్థితులలో, రాజధానిని సూచించడానికి పై చెప్పిన అదికార సమావేశాన్ని ప్రకాశంగారు తమ యింటిదగ్గర ఏర్పాటు చేశారు.

అనేక పట్నాలనుంచి, ఆయా పట్నాలకు చెందిన మిత్రులు, తమ పట్నాలలో గల సౌకర్య సంపదల ఛాయా చిత్రాలను తెచ్చి, ఆ