పుట:Naajeevitayatrat021599mbp.pdf/822

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని, ఆ రోజు ఆ నిర్ణయం చేసుకోక తప్పదన్న అత్యంత అవసరమును కనిపెట్టి, ప్రకాశంగారిపైనే ఈ నిర్ణయభారం వదిలివేద్దామని ఎవరో మెల్లిగా అన్నారు. అందరు గట్టిగా ఆ అభిప్రాయంతో ఏఖీభవించారు.

"అయితే, మీ రంతా మూడు గంటలకు రండి. తిరిగి సమావేశమవుతాము. అందులో నా నిర్ణయం చెపుతాను," అన్నారు ప్రకాశంగారు.

మూడు గంటలకు తిరిగి ప్రకాశంగారి గదిలో కూచున్నాము. ప్రకాశంగారు, "లచ్చన్నగారూ! ఒక కాగితం, పెన్సిలూ పట్టుకోండి," అన్నారు. తర్వాత "నా నిర్ణయం చెప్తాను. ఆ పేరు కాగితంమీద వ్రాయండి," అన్నారు.

అక్కడ కూడిన ఏడెనిమిది మందిమీ ఒక కన్ను ప్రకాశం గారిమీదా, రెండవది లచ్చన్న గారి పెన్సిలుపైనా ఉంచి చూస్తున్నాము.

ప్రకాశంగారు, "వ్రాయండి! 'కర్నూల్‌' అని వ్రాయండి" అన్నారు.

అందరూ ఆశ్చర్యంతో నిశ్శబ్దంలో మునగడం జరిగింది.

కాగితంమీద 'కర్నూల్‌' అని వ్రాయక తప్పదని, లచ్చన్నగారు వ్రాశారు.

నవ్యాంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధాని జన్మ, నామకరణం ఆ క్షణంలో జరిగింది.

అందరూ లేచి ఎవరి మానాన వారు వెళ్ళారు.

శాసన సభా కార్యదర్శికి - ఆంధ్ర శాసన సభ్యులు సమావేశంలో తాత్కాలిక రాజధానిగా కర్నూలును ప్రతిపాదిస్తున్న తీర్మానం, నోటీసు టైపు చేయించి పంపారు.

ఇది రాయలసీమలో ఏర్పాటయినది గనుక, సంజీవరెడ్డిగారు ప్రతిపాదిస్తున్నట్టు సంతకం వద్దనుకొన్నారు. ఇవి కోస్తా జిల్లాలవారి సంతకంతో ఉండడం భావ్యమని భావించారు.

"గౌతు లచ్చన్నగారు ఒక పార్టీ అధినేత గనుక, ఆయన ఈ నోటీసుమీద సంతకం పెడితే బాగుంటుంది," అన్నాను నేను.