పుట:Naajeevitayatrat021599mbp.pdf/808

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దగ్గర ఏవేవో గ్రాంటులు కావాలని చేయి జాచుతూ వస్తూంది కదా! అలా చేయి జాచే ప్రభుత్వానికి బేరంచేసే తాహతు ఉన్నదా?"

రాష్ట్రంలో కాంగ్రెసు రాజకీయాలలో నాయకత్వ శూన్యమైన అవస్థ వచ్చిందని పైన వ్రాసే ఉన్నాను. ఆ సమయంలో ఎవరి ఊహో, ఎవరి తంత్రమో, చెన్నపట్నంలో పుట్టిందో, ఢిల్లీలో పుట్టిందో ఇప్పటి దాకా సరిగ్గా తెలియదు కాని, మహేంద్ర పదవి అనుభవించి వచ్చి విశ్రాంతి తీసుకొంటున్న రాజాజీని ఈ చెన్నరాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకువస్తేతప్ప, కాంగ్రెసు సంస్థ రాష్ట్రంలో నామ మాత్రావశిష్టమై నశిస్తుందనీ ఊహారచన జరిగింది. ఆ ఊహారచన తమదే అన్నట్టుగా శ్రీప్రకాశగారు తమ జీవిత చరిత్రలో వ్రాసుకొన్నారు.

సంవిధానం ప్రకారం లెజిస్లేటివ్ కౌన్సిలు (శాసన మండలి)లో కొందరు సభ్యులను నియమించే హక్కు గవర్నరుకు ఉంది. దాన్ని పురస్కరించుకొని గవర్నరు రాజాజీని శాసన మండలి సభ్యులుగా నియమించారు.

తరువాత వెనువెంటనే, డిల్లీనుంచి కాంగ్రెసు అధిష్ఠాన వర్గంవారు, శాసన సభ కాంగ్రెసుపార్టీ వారికి - కాంగ్రెసు శాసన సభ్యులను సమావేశపరిచి, రాజాజీని నాయకునిగా ఎన్నుకోవలసిందని ఆదేశించారు. వారు అలాగే సమావేశమై రాజాజీని తమ పార్టీనాయకునిగా ఎన్నుకొన్నారు. గవర్నర్ జనరలుగా పనిచేసిన రాజాజీ చిన్న పదవి అనుకోకుండా, సంతోషంగా ఆ పదవి స్వీకరించారు.

ఇదిచూసి, ప్రకాశంగారు - యునైటెడ్ ఫ్రంటుకు చెందిన 164 సభ్యుల సంతకాలతో ఒక విజ్ఞప్తి గవర్నరుగారికి పంపించారు.

రెండు ఇతర పార్టీలతో కలిసినప్పటికీ కాంగ్రెసు మైనారిటీలో గనుక ఆపార్టీ నాయకుని ముఖ్యమంత్రి పదవికి ఆహ్వనించక, యునైటెడ్ ఫ్రంటు నాయకునికే అటువంటి ఆహ్వానం పంపించవలసిందని ఆ విజ్ఞప్తిలో సూచింపబడింది.

శ్రీప్రకాశగారు పెద్దమనిషే అయినా, ఆ విజ్ఞప్తిలోగల విషయాన్ని మాట్లాడడానికైనా ప్రకాశంగారిని ఆహ్వానించలేదు. రెండు,