పుట:Naajeevitayatrat021599mbp.pdf/809

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడు రోజులు ఆ విజ్ఞప్తి ఆయన తన దగ్గిరే అట్టిపెట్టుకొని, అంతట్లో రాష్ట్రకన్యను వివాహ మాడడానికి సిద్ధపడ్డ రాజాజీని ఆహ్వానించారు.

పత్రికా విలేఖరులు, "ఇది సంవిధానానికీ, సంప్రదాయానికీ విరుద్ధం కాదా?" అని అడిగితే, "ప్రకాశంగారి పార్టీ కలగాపులగం పార్టీ గనుక పిలవ లే" దన్నారు.

"అయితే, రాజాజీ పార్టీకూడా కృషికార్ లోక్, ముస్లింలీగు పార్టీల సహాయంతోనే కదా ఉన్నది?" అని వారు వేసిన ప్రతిప్రశ్నకు, ఆయన - "శాసన సభలో ఉన్న పార్టీ లన్నింటిలోనూ రాజాజీ పార్టీ సంఖ్యా దృష్ట్యా పెద్ద" దని ప్రత్యుత్తర మిచ్చారు.

"మైనారిటీ పార్టీకి రాజ్యం అప్పగించకూడదు. అలా చేసినట్టయితే ప్రభుత్వంవారు తమతో అంతకు ముందుదాకా కలియని సభ్యులకు ప్రలోభాలు చూపించి, తమలో కలుపుకోడానికి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. దీన్నే పాశ్చాత్య దేశాల రాజకీయాల్లో అశ్వ విక్రయ (హార్స్ ట్రేడింగ్) విధాన మంటారు. అది జరగడం మంచిది కాదుగదా!" అని విమర్శకులు చెప్పగా -

"ఇక్కడ అటువంటిది జరగదు" అన్నారు శ్రీప్రకాశగారు.

మంత్రివర్గం ఏర్పడి, మొదటి శాసన సభా సమావేశం కాకుండానే, యునైటెడ్ ఫ్రంటులో నలుగురి సభ్యులతో భాగంగా ఉన్న ఒక చిన్న పార్టీ రాజాజీ పక్షం వైపు వెళ్ళడమూ, ఆ నలుగురికీ నాయకుడైన మాణిక్యవేలు నాయకరుగారిని రాజాజీ ఒక మంత్రిగా తీసుకోవడమూ జరిగాయి.

శ్రీప్రకాశగారు జరగదన్న అశ్వ విక్రయం చెన్నరాష్ట్ర రాజకీయ విపణిలో ఆదిలోనే ఆరంభమయింది.

గవర్నరు ప్రసంగానికి ప్రకాశంగారి అధిక్షేపణ

శ్రీప్రకాశగారు - సంవిధానపు 176 వ అనుచ్ఛేదము (ఆర్టికల్) క్రింద ఉభయ శాసన సభలకు తమ సంబోధ (అడ్రెస్)నోపన్యాసము చేయడానికి నిలుచున్నారు.