పుట:Naajeevitayatrat021599mbp.pdf/775

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక్కడే కూచుంటాను," అన్నారు. ఆయన కదలకపోయేసరికి నాకూ ధైర్యంవచ్చి, నేనూ కదలలేదు.

ఆ యుద్ధమంతా మాకు రెండు బారల దూరంలోనే జరుగుతున్నది. కొంత సేపటికి కమ్యూనిస్టు పార్టీ మిత్రులు తమ బాణా కఱ్ఱలతో వెనకకు పోయారు. ఆ తరువాత అక్కడ రెండు గంటల సేపు సభ జరిగింది.

అటువంటి ప్రకాశంగారు బెజవాడలో కాంగ్రెసువారు చేసిన అల్లరికి ఎందుకు లొంగుతారు?

ఆ కాంగ్రెసువారే తరువాత అక్కడినుంచి పోయారు.

శాసన సభలో పాయింట్ ఆఫ్ ఆర్డరు

1947 ఆగస్టు 15 న అఖండ భారతదేశం ఖండమై స్వాతంత్ర్య ప్రాప్తి పొందింది. చెన్నరాష్ట్ర అసెంబ్లీ 16-9-1947 న స్వాతంత్ర్యానంతరం ప్రథమ సమావేశం జరుపుకొన్నది.

నాడు, ప్రకాశంగారు ఒక పాయింట్ ఆఫ్ ఆర్డరు (అనగా - ఒక పని శాసన సభ కార్య సూత్రాలకు వ్యతిరేకంగా జరిగినపుడు దానిని గూర్చి సభాద్యక్షునికి ఏ సభ్యుడైనా చేసే సూచన) లేవదీశారు.

ఆయన లేవదీసిన మొదటి పాయింటు ఇది: బ్రిటిషు హవుస్ ఆఫ్ కామన్స్‌లో పాసయిన, ఇండియన్ ఇండిపెండెన్స్ ఆక్టు (ఇండియా స్వాతంత్ర్య శాసనము)లో - ఇండియాలో అప్పటికి పనిచేయుచున్న కేంద్ర శాసన సభ ఏదో, అదే స్వాతంత్ర్యానంతరం శాసన సభగానూ, నూతన సంవిధాన నిర్మాణ సభగానూ ద్వివిధ శక్తులతో పనిచేయగలదని వ్రాసి ఉంది. అందులో రాష్ట్ర శాసన సభల ప్రసక్తి లేదు. అందుచేత, అవి రద్దు అయినట్టుగానే భావించాలి. కనుక, చెన్నరాష్ట్రంలో పాత శాసన సభ ఆ రోజున శాసన సభగా పనిచేసే వీలులేదు.

ఇక రెండవ విషయము:

ఒకవేళ పనిచేసినా, శాసన సభ్యులు, మంత్రులూ స్వతంత్ర భారత ప్రభుత్వానికి తమ విధేయతను చూపించే ప్రమాణం చేయనిదే