పుట:Naajeevitayatrat021599mbp.pdf/776

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసన సభలో వారు ఏ కార్యాలు చేసే వీలులేదు. ఇదివరలో వారు తీసుకొన్న ప్రమాణంలో - వారు, బ్రిటిష్ చక్రవర్తికి తమ విధేయతను చూపించగలమని ప్రమాణం చేశారు.అందుచేత, క్రొత్త ప్రమాణం అవసరము. ఇదే రెండవ పాయింటు.

ఢిల్లీలోని సంవిధాన సభ ఈ విషయమై ప్రత్యేకంగా శాసన దత్తత ఆదేశము (Adaptation order) పంపలేదన్న వాదం చెల్లలేదు. బ్రిటిషు గవర్నమెంటుకు సర్వ విధేయతలు చూపిస్తామన్న పాత ప్రమాణంతో, స్వతంత్ర భారతదేశ శాసన సభలో ఈ శాసన సభ్యులు ఎలాగు పనిచేయగలరు?

అసలు, అంతకు ఒక రోజు క్రితం ముగ్గురు శాసన సభ్యులు, క్రొత్తగా ప్రమాణం తీసుకోవలసి వచ్చినప్పుడు, భారతదేశ సంవిధానానికే తమ విధేయత ప్రకటిస్తూ ప్రమాణాలు చేశారు. అందుచేత శాసన సభలో అప్పుడు భారతదేశ సంవిధానికి విధేయత చూపించే వారు కొందరూ; మనల్ని విడిచిపెట్టి వెళ్ళిన బ్రిటిష్‌వారి చక్రవర్తికే విధేయత చూపించి ప్రమాణం చేసినవారు మరి కొందరూ (చాలామంది) ఉన్నారు. ఇది కూడదని ప్రకాశంగారు లేవదీసిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను సభాధ్యక్షుడు త్రోసివేశాడు. ప్రకాశంగారి పాయింటు సరి అయినది కాదని అధ్యక్షుడు ఇచ్చిన రూలింగు సరి అయినది కాదని నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

ఈ పాయింటు లేవదీసినపుడు శాసన సభలో చర్చింపబడుతున్న విషయము - జమీందారీ రద్దు బిల్లు. ప్రకాశంగారు ఆ సందర్భంగా ఇలా అన్నారు:

"కాంగ్రెసు అధిష్ఠాన వర్గంవారు ఈ జమీందారీ రద్దు బిల్లు చర్చించడానికి పూర్వం చెన్నరాష్ట్రపు మంత్రులు తమ దగ్గరికివచ్చి సలహా తీసుకోవలసిందని ఆదేశించారు. వారు చెప్పినట్టు ఈ ప్రభుత్వంవారు నడుచుకోవాలి.

"అధ్యక్షా! కాంగ్రెసు అధిష్ఠాన వర్గంవారు మన ప్రభుత్వంలో ఇటువంటి అతి జోక్యం కల్పించుకోకూడదని నేను