పుట:Naajeevitayatrat021599mbp.pdf/766

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పత్రికలలో పడ్డాయి. ఆ మూడిటిలో ఒకటి నా పేరు కావడం తటస్థించింది. నా మటుకు నేను ఎప్పుడూ ఒక చిన్నవాణ్ణిగానే భావించుకుంటూ వచ్చాను. ఆ విధంగానే ప్రజాసేవ (దేశసేవ) చేయడానికి వచ్చాను. ప్రత్యేకంగా బలం కలిగించే ఉన్నతమైన అధిష్ఠానవర్గం ఎన్నడూ లేదు. ఎప్పుడూ ఎవరో కొందరు పెద్దలతో నాకు తగాదాలు వస్తూనే ఉండేవి. వాటిని ఏదోవిధంగా పరిష్కరించి, బ్రతకగలిగి జీవితయాత్ర నడుపుకొంటున్నాను. ఎవరికైనా అజేయుడైన ప్రతిపక్ష నాయకునికింద నన్ను నేను భావించుకోలేదు. కాని, సామాన్య ప్రజాకోటికి నా యందు అభిమాన విశ్వాసాలు కలవన్న ప్రతీతి ఒకటి ఉంది.

"ఈ రోజు మార్చి 25 వ తేది. ఇంకొక అయిదు రోజులకు 1947 మార్చి 30 వస్తుంది. అప్పటికి సరిగా ఒక సంవత్సరం క్రింద, అంటే 1946 మార్చి 30 న ఆంధ్రప్రాంతంనుంచి ఒక గౌరవ సభ్యుడు, చెన్నరాష్ట్రంలో గల రాజకీయ పరిస్థితులను గురించి అధిష్ఠానవర్గంలో ఉన్నతస్థానం వహించిన ఒకరితో చెప్పడానికి వెళ్లారు. వెళ్ళవలసిందని ఆయనను ఎవరూ పంపించ లేదు. స్వయం ప్రతినిధిగా వెళ్ళారు. అధిష్ఠానవర్గంవారితో - చెన్న రాష్ట్రం తిండి కరువుతో, బట్ట కరువులలో, గడ్డు స్థితిలో ఉన్నదనీ, సరి అయిన నాయకుణ్ణి ఎన్నుకొనకపోతే రాష్ట్రం ధ్వంసమయిపోతుందనీ వారు చెప్పారు. ఇంతేకాక, మరొక విషయం కూడా చెప్పారు. పోటీ పడుతున్న ముగ్గురు నాయకులలో నన్ను తప్పించి, తక్కిన ఇద్దరూ చేతులు కలుపుకొనేలాగున అధిష్ఠానవర్గంవారు చేయవలసిందిగా కూడా గట్టిగా చెప్పారు. మంత్రివర్గంలో నాకు ఎదురుగా ఇప్పుడు కూచున్న ఒకరు [1] వెంటనే, అక్కడినుంచి తాను తనపై వేసుకొన్న దౌత్యం సఫలమయిందని రాజాజీకి ఒక ఉత్తరం కూడా వ్రాశారు. ఆ

  1. బి. గోపాలరెడ్డిగారు.