పుట:Naajeevitayatrat021599mbp.pdf/758

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇప్పుడు కూడా అదే విధంగా, జీతం పుచ్చుకొని ఉద్యోగంలో ఉన్న ఉద్యోగులే ప్రభుత్వం పేరున, మంత్రుల ప్రమేయం లేకుండానే - ఫైలు మంత్రివరకు వెళ్ళేటంత ముఖ్యం కాదన్న నెపంపైనో, ఇటువంటి విషయముపై మంత్రి పూర్వం ఒకప్పుడు తన అభిప్రాయం చెప్పాడు గనుక, అధే విధంగా చేతిలోని ఫైలుకూడా నిర్ణయం కాగలదన్న నెపంపైనో కార్యదర్శులు తామే ఆర్డర్లు జారీ చేస్తుంటారు.

వారికికూడా వ్యవధిలేదన్న నెపంపైన వారి వరకు వచ్చే ఫైళ్ళలో సగం ఫైళ్ళను వారి ప్రమేయం లేకుండానే డిప్యూటి సెక్రటరీలు తమకు తోచిన రీతిని ఆర్డర్లు వేయవచ్చనీ, వారికీ వ్యవధిలేదన్న నెపంపైన అసిస్టెంటు సెక్రటరీలుగాని, అండర్ సెక్రటరీలుగాని ఆర్డర్లు పాస్ చేయవచ్చనీ సచివాలయం కార్య నిబంధనలలో వ్రాసి ఉంటుంది. ఈ కార్య నిబంధనలకు గవర్నరు ఆమోద ముద్ర వేస్తాడు. ఈ ఆమోద ముద్రే, శాసనాలు ఏవీ లేకున్నా తమకు అధికారాన్ని సంక్రమింప జేస్తున్నదని ఉద్యోగుల వాదము. మొత్తంపైన ఇపుడు వారి వాదమే ప్రబలమై, డిల్లీ ప్రభుత్వంలోను, రాష్ట్ర ప్రభుత్వాలలోను సాగుతున్నది.

ఇందుకు నా కొక మూలకారణం కనిపిస్తూంది. ఈ ప్రధానులు రాజాజీ అయినా, ప్రకాశంగారు అయినా, పండిట్ నెహ్రూజీ అయినా ఒకటే పద్ధతి. బలవంతంగా కొందరిని తమ మంత్రివర్గంలో చేర్చుకుంటారు. అటువంటి వారికి వారి అంగీకార, అనంగీకారాలతో ప్రసక్తి లేకుండా ఆ ముఖ్యమంత్రిగాని, ప్రధానిగాని తనకు తోచిన ఒక శాసన సభ్యుణ్ణి ఆ మంత్రి దగ్గర పార్ల మెంటరీ సెక్రటరీగా నియమిస్తాడు. ఆ పార్లమెంటరీ సెక్రటరీ పైన ఆ మంత్రికి విశ్వాసముండదు. మంత్రి తనకు ఇష్టంవచ్చిన కాగితాలను మాత్రం పార్లమెంటరీ సెక్రటరీకి చూపించవచ్చనే రాజీ సూత్రంపైన ఏవైనా కొన్ని కాగితాలను చూపించవచ్చు. లేకుంటే లేదు. పరస్పర విశ్వాసంలేని మనుష్యులను ఒక కూటమిలో చేర్చడానికి యత్నించడంవల్ల, ఈ ప్రతి