పుట:Naajeevitayatrat021599mbp.pdf/757

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మెంటరీ సెక్రటరీలకు ఆ హక్కును మంత్రివర్గంచేసే కార్యనిబంధనలకు లోబడి సంక్రమింపచేస్తారని అనుకున్నాము. అయితే ఆ సమయంలో శొంఠి రామమూర్తిగారు (ఐ.సి.ఎస్) ముఖ్య కార్యదర్శిగా ఉండేవారు. ఆయన ప్రజాహితైక జీవి, న్యాయబుద్ది, విజ్ఞానము కలవాడే అయినా, ఇంగ్లీషు ఐ.సి.ఎస్. ఉద్యోగులకన్నా హెచ్చుగా ఐ.సి.ఎస్. తత్త్వం ఆయనలో ఉండేది.

ఈ సమయంలో నేను, ప్రకాశంగారికి ఇంగ్లండులో జరిగిన ఒక ఉదంతం చెప్పాను.

ప్రపంచ యుద్ధమప్పుడు దేశ సంరక్షణ నిబంధనల క్రింద ప్రభుత్వం, ఏ వ్యక్తినైనా దేశరక్షణకు ప్రతికూలుడుగా ఉన్నాడని భావించితే, ఏ విచారణా లేకుండా కారాగృహంలో ఉంచవచ్చుననే నిబంధన ఉండేది.

ప్రభుత్వం (అనగా మంత్రి) ప్రమేయం లేకుండానే ఒక వ్యక్తిని కారాగృహంలో ఉంచడానికి ఒక కార్యదర్శి ఆజ్ఞ జారీ చేశాడు. ఆ వ్యక్తి ఇది అక్రమమని హైకోర్టులో రిట్ ఇవ్వవలసిందని పిటీషన్ దాఖలు చేసుకొన్నాడు. హైకోర్టువారు - ప్రభుత్వం, మంత్రి అన్నచోట కార్యదర్శి మంత్రి ప్రమేయం లేక ఎన్నడూ ఆర్డర్ పాస్ చేయలేడని తీర్పు ఇచ్చారు. [1]

1946 లో ఐ.సి.ఎస్. ఉద్యోగుల అభ్యంతరమే కాక, లోగడ 1938 లో పార్లమెంటరీ సెక్రటరీగా ఉన్నపుడు పార్లమెంటరీ సెక్రటరీలకు హక్కులు కావాలని వాదించిన మిత్రుడు, 1946 లో మంత్రి అయి, అ హక్కులు కూడదని వాదించ సాగాడు.

ప్రకాశంగారికి, రామమూర్తిగారి అభిప్రాయమంటే మంచి నమ్మకము. దానికితోడు, పై చెప్పిన మంత్రికూడా ఐ.సి.ఎస్. ఉద్యోగుల అభిప్రాయాన్ని బలపరచినపుడు - ప్రకాశంగారు, మొత్తంపైన ఎన్నికై, సహచరులుగా ఉన్న పార్ల మెంటరీ సెక్రటరీలకు ఫైలుచూసే అధికారాలు ఉండవని కాబినెట్‌లో నిర్ణయించారు.

  1. ఆ వ్యక్తి విన్‌స్టన్ చర్చిల్ గారి అల్లుడని నాకు జ్ఞాపకము.