పుట:Naajeevitayatrat021599mbp.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్తిచేశాను. చివరికి ఆ అభ్యంతరం బయటకి వచ్చింది. వయస్సు సర్టిఫికెట్ కోసం అక్కడ సివిల్ సర్జనుగా వున్న మేజర్ కోమా దగ్గరకి వెడితే, అతను నాకు 'జ్ఞాన దంతం' (Wisdom tooth) రాలేదని సర్టిఫికెట్ నిరాకరించారు.

దాంతో నా ఆశయానికి భంగం కలిగింది. ఒక్క సంవత్సరం వృథా అయింది. ఆ సంవత్సరంలో ఫస్టుగ్రేడ్ కి ప్రైవేటుగా వెళ్ళడానికి అవకాశం తీసివేస్తారు. త్వరలో బి.ఏ. పాసయితే కాని ఫస్టుగ్రేడు పరీక్షకి వెళ్ళడానికి వీలులేదనే నియమాలు వస్తున్నాయి. అందుచేత 1892లో లాకాలేజికి వెళ్ళి చదవడం తప్ప వేరే మార్గం లేదు. మద్రాసులో లాకాలేజిలో చదువంటే తాడూ బొంగరమూ లేని నాబోటి వాడికి ఎల్లాగ సాధ్యం అవుతుంది? మళ్ళీ హనుమంతరావు నాయుడు గారి కొక సమస్య. నే నాయన్ని శ్రమపెట్టడానికి మొహమాటపడ్డాను. కాని, ఆయనే "ఎల్లాగో తంటాలు పడదాము; సాహసించ"మన్నారు. ఆయన డబ్బు ఎల్లాగ తెచ్చేవారో నాకు తెలియదు. అప్పుడప్పుడు అప్పులు కూడా చేశారనుకుంటాను. కొణితివాడ జమీందారుదగ్గర 90 రూపాయలు తేవడం మాత్రం నాకు తెలుసును. ఆ జమీందారు థీయిస్టిక్ స్కూలులో నాకు సహాధ్యాయి. ఆ చనువుచేత నాయుడుగారు జమీందారు దగ్గిరికి నడిచివెళ్ళి 90 రూపాయలు పట్టుకుని వచ్చి నాకు పంపించారు.

అప్పటికింకా మదరాసుకి రైలు పడలేదు. బెజవాడదాకా పడవ మీద వెళ్ళి, అక్కడనించి గుంతకల్లు పోయి, గుంతకల్లునించి మదరాసు వెళ్ళాము. ఆ తరవాత మదరాసులో నేను లాకాలేజిలో చేరాను. అక్కడ పెమ్మరాజు గుర్రాజు, సారంగు భీమశంకరం, వరాహగిరి జోగయ్య, వేములూరి వెంకట్రాయుడు మొదలైనవారు నా సహాధ్యాయులు, మేము నలుగురైదుగురూ కలిసి నల్లతంబివీథిలో ఒక చిన్న భోజనవసతి ఏర్పాటుచేసుకున్నాము.

అప్పుడు లాకాలేజీకి ప్రిన్సిపాల్ నెల్సన్. అధ్యాపకులు వి.కృష్ణస్వామయ్యరుగారు, టి.వి.శేషగిరయ్యరుగారు, హెచ్.రంగప్పగారు