పుట:Naajeevitayatrat021599mbp.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సెకండ్ గ్రేడు ప్లీడర్లు, వాలస్ పట్టాదార్లు అని నాలుగు విధాలుగా ఉండేవాళ్ళు. సుబ్బారావు పంతులుగారు, మాదిరెడ్డి వెంకటరత్నం నాయుడుగారు, మాకర్ల సుబ్బారావునాయుడుగారు, చిత్రపు వెంకటాచలంగారు మొదలైన వాళ్ళంతా ఒక తరహా. వీళ్ళందరికీ సుబ్బారావు పంతులుగారు నాయకుడు. ఆయన్ని గురించీ, ఆయన రాజకీయాలని గురించీ, ముందుముందు వ్రాస్తాను. మాకర్ల సుబ్బారావునాయుడుగారు మారడుగులవారి సందులో వున్న కంచుమర్తివారి మేడలో ప్రాక్టీసు చేస్తూ వుండేవారు. ఆయన దివ్యజ్ఞాన సమాజసభ్యుడు. అస్తమానమూ ఆ ధ్యాసలోనే వుండేవాడు. అప్పటికి వెంకటరత్నంనాయుడుగారు, వెంకటాచలంగారు, ఆట్టే అంత పెద్ద ఎన్నికలో పడలేదు.

ఇంక ఫస్టుగ్రేడ్ లో, నిడమర్తి దుర్గయ్యగారు అనే జలదుర్గ ప్రసాదరాయుడుగారు, ములుకుట్ల అచ్యుతరామయ్యగారు, నేతి సోమయాజులుగారు, వగైరాలు వుండేవారు. వారంతా మంచి ప్రాక్టీసుదారులు. సెకండు గ్రేడులో కనపర్తి శ్రీరాములు, ఏలూరి వెంకట్రామయ్యగార్ల ఫైలు జోరుగా వుండేది. ఇక వాలస్ (wallace) పట్టాదార్లలో దామరాజు నాగరాజుగారి ప్రభ జోరుగా వుండేది. ఆయన ఒక్క అక్షరం ఇంగ్లీషు ముక్క అయినా లేకుండా ఎంతసేపైనా చాలా సరసంగా ఆర్గ్యుమెంటు చెప్పేవారు. అప్పట్లో కాకినాడలో ఉన్న గంజాం వెంకటరత్నం, కృత్తివెంటి పేర్రాజుగార్లు జిల్లాకంతటికీ పెద్ద ప్లీడర్లుగా వుండేవారు. వీరు జమీందారుల ప్లీడర్లుగా వుండి పేరు ప్రఖ్యాతులు, డబ్బూ కూడా సంపాదించారు. వీ రుభయులూ కాకినాడ మునిసిపల్ రాజకీయాల్లో కూడా బాగా పేరుపడ్డారు. ఉభయులూ మెట్రిక్యులేషన్ పాసయిన ప్లీడర్లయినా కేసులు నడిపించడంలో వారికి ఏ బి.ఎల్.లూ సరిపోయేవారు కారు. పేర్రాజుగారు మంచి హుందా అయిన సరళిలో కేసు ఆర్గ్యుమెంటు చెప్పేవాడు. వెంకటరత్నంగారు మంచి మేధావి. ఇక ఇటు ఏలూరులో ములుకుట్ల అచ్యుతరామయ్యగారు అనే ఆయన వుండేవారు. ఆయన శుద్ధ తెలుగు ప్లీడరు. మనిషి మంచి స్ఫురద్రూపి. చంకీజోళ్ళు వగైరాలు ధరించి బాగా దర్జాగా