పుట:Naajeevitayatrat021599mbp.pdf/746

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావాలను ప్రదర్శించేవారు. 1947 మార్చిలో, పార్టీలో ఆయనకు ఎదురుపక్షంలో ఉన్న మూడు వర్గాలవారూ ఏకమయ్యారనీ, ఆయనమీద విశ్వాసరాహిత్య తీర్మానం ప్రతిపాదిస్తారనీ పత్రికలలో వార్త పడగా శాసన సభలో ప్రతిపక్షంవారు ఆ ప్రశ్న లేవదీశారు.

ఆ విషయంపై మాట్లాడుతూ ప్రకాశంగారు ఇలా అన్నారు:


"మాలో మాకు భేదాలున్నాయని మీరంతా అంటున్నారు. నేను ఒక మాట చెబుతాను వినండి. ఈ కాంగ్రెసుపార్టీకి తనపని ఎలాగు చేసుకోవాలో తెలుసు. భేదాలు ఒకప్పుడు ఉంటాయి. ఒకప్పుడు అవి అపమార్గం కూడా పట్టవచ్చు. కానీ, అధ్యక్షా! నే నొకటి మనవి చేస్తున్నాను. ముఖ్యమైన విషయాలపై మా పార్టీలో భేదాభిప్రాయాలు లేవు. ఈ మంత్రివర్గం ఎన్నాళ్ళుంటుందని ప్రతిపక్షంవారెవరో అడిగారు. ఇప్పుడిక్కడ ఉన్న మంత్రులు రేపు లేకపోయినా, రేపు వచ్చేవారూ కాంగ్రెసువారేగాని ఇంకొకరు కారు. మాకు భేదాలు లేవని చెప్పాను. అందుచేత రేపు వారు కూడా ఇప్పుడు నడిపిస్తున్న విధానాలనే నడిపిస్తారు."

ప్రకాశంగారు ఈ మాటలు గాంధీగారు తమ స్కీములను ఆమోదించి, ప్రశింసించారన్న ధైర్యంతో చెప్పగలిగి ఉంటారు. కానీ, పార్టీలో తమ కెదురుగా ఉన్నవారు తమ్ము కాదన్నపుడు గాంధీగారు మరి మాట్లాడరన్న సంగతి ఊహించుకోలేకపోయారు. నా వంటి వాళ్ళము కూడా అది ఊహించలేకపోయాము.

ప్రకాశంగారు ఇంకా ఇలా అన్నారు:

"నేను ఈ ప్రజారంగంలో 26 సంవత్సరాలగా పనిచేస్తూ వస్తున్నాను. ఈ శాసన సభలో ప్రధాన మంత్రిగా కూర్చుండడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పబ్లిక్ రంగంలో నేనా పని చేయలేదు. ప్రజాసేవకుడిగానే నేను పరిపాలన సాగిస్తున్నాను. నన్నిక్కడికి పంపించిన ప్రజలకు నేను ఎలా