పుట:Naajeevitayatrat021599mbp.pdf/738

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నంగా ఉండే ధాన్యం లెక్క వేయడమేగాక, రేషన్ నిబంధనల ప్రకారం ధాన్యం ఉత్పత్తిచేసే వృత్తిలోలేని జనాభాకు ఎంత ధాన్యం అవసరమో కూడా ఆ గ్రామ సంఘాలవారే నిర్ణయించేవారు. గ్రామస్థులు ఈ విధంగా పరిపాలనలో అనుకోకుండానే భాగస్వాము లయ్యారు. అదే విధంగా గ్రామస్థులకు కావలసిన ఇతర కంట్రోలు వస్తువుల అవసరాన్ని కూడా ఈ గ్రామ సంఘంవారు చూడడానికి ఏర్పాటు జరిగింది. అంతేకాక, గ్రామస్థుల పరపతి, అవసరాలు కూడా గ్రామ సంఘాలు మదింపుచేసే, ఏర్పాటు ఈ స్కీములో అంతర్భాగము.

గ్రామ సంఘాలనుంచి వచ్చిన రిపోర్టులనుబట్టి ఫిర్కా సంఘము ఫిర్కా సంఘాలనుంచి వచ్చిన నివేదికలనుబట్టి జిల్లా సంఘము, వీటి సలహాపైని సప్లై డిపార్ట్‌మెంట్‌వారును నడచుకోవడానికి - అనగా, సేకరణ, సరఫరా, పరపతి (రూరల్ క్రెడిట్) సదుపాయాలు సమగ్రంగా జరగడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అంతేకాక, గ్రామాలలో క్రిమి కీటకాదుల బెడదలేని గిడ్డంగులు నిర్మించడానికి కూడా ఏర్పాట్లు జరిగాయి, గ్రామస్థులకు సరఫరా చేయగా మిగిలిన బియ్యం, పంచదార, కిరసనాయిలు, నూలు, బట్ట, వ్యవసాయ పనిముట్లు, బండ్లకు, ఇనుప పట్టాలు మొదలైనవి అదనంగా ఉంటే, వాటిని తాలూకా సంఘం అవసరమైన చోట్లకు పంపడానికి, అక్కడా అదనంగా ఉన్నవాటిని జిల్లా సంఘాలకు అప్పజెప్పడానికి ఏర్పాట్లు జరిగాయి.

ఇవి బహుళార్థ సాధక లక్ష్యాలుగల సహకార సంఘాలు (Multi-purpose Co-operative Societies) కావడంచేత-ప్రభుత్వం, ఈ సంఘాలు, ప్రజలు అనే మూడు పక్షాలు ఐకమత్యంతో ముందుకు నడవడానికి ఉపయోగపడతాయి. స్వయంపోషక గ్రామ స్వరాజ్య సంస్థాపనకు ప్రకాశంగారు ఏర్పాటు చేసిన ఈ బహుళార్థ సాధక సహకార సంఘాలు పునాదులు కాగలవని ప్రజలకు విశ్వాసం కలిగింది.

ఈ స్కీము విషయాలన్నీ ప్రకాశంగారు శాసన సభ ప్రథమ సమావేశంలోనే వెల్లడించారు.