పుట:Naajeevitayatrat021599mbp.pdf/736

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్తారు. వారు చాలా మైనారిటీలో ఉంటారు గనుక, బిల్లు పాసుకాదన్న భయం వారి కుండదు. బిల్లు పాసయిన లాభము, ఎదిరించిన లాభము కూడా వారు పొందుతారు. వేతనం పెంచడానికి ఒక బిల్లు వచ్చినపుడు నేను ఎదిరించాను. బిల్లు పాస్ అయిన తరువాత, అదనంగా పెంచిన వేతనాన్ని తీసుకోడానికి నేను నిరాకరించాను. వావిలాల గోపాలకృష్ణయ్యకూడా అలా నిరాకరించినట్టు నేను విన్నాను. ఇంతకు తప్ప, ఏ రాష్ట్రంలోనూ, ఏ శాసన సభ్యుడూ వేతనం పెంపుదలను ఎదిరించి, దాని లాభాన్ని నిరాకరించినట్టు నేను వినలేదు.

1946 లో అటువంటి బిల్లుకు వచ్చిన అభ్యంతరాలకు జవాబుగా, "దేశంలో ఉన్న పరిస్థితి కాంగ్రెసు అధిష్ఠాన వర్గం వారికి తెలుసు. పరిస్థితి ఆలోచించి, కాంగ్రెసు మంత్రివర్గాలు ఏర్పాటు చేస్తున్నపుడు, కాంగ్రెసు మంత్రులు అలవెన్సులతో కలిపి, 1600 రూపాయలు పుచ్చుకోవచ్చునని, శాసనంతో తగిన మార్పు చేయవలసిందని సలహా యిచ్చిన మీదటనే ఈ బిల్లు ఇక్కడ ప్రవేశ పెట్టడమైనది", అన్నారు ప్రకాశంగారు.

బిల్లు సులభంగానే పాస్ అయిపోయింది.

ఆ ప్రథమ సమావేశంలోనే రాష్ట్రంలో ఆహార పరిస్థితుల విషయమై, ప్రకాశంగారు కొన్ని వివరాలు చెప్పారు. మన రాష్ట్రంలో ఆనాడు 49 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయ్యేది. అది చాలక, 4 లక్షల 51 వేల టన్నులు మనము దిగుమతి చేసుకోవలసిన స్థితిలో ఉండే వాళ్ళము. భారత దేశం మొత్తం పైన చూసినట్టయితే (అనగా బర్మా మన దేశంతో కలిసి ఉన్న పరిస్థితులలో) మనకు పై దేశాలనుంచి బియ్యం దిగుమతి చేసుకొనే అవసరం లేకపోయింది. కాని, 1941 డిసెంబరులో జపాన్ ప్రపంచ సంగ్రామంలో పాల్గొనడం ప్రారంభించి నప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి.

ప్రకాశంగారు ప్రభుత్వంలోకి వచ్చే నాటికి, 68 వేల టన్నుల బియ్యము, లక్షా అరవై ఆరు టన్నుల ఇతర ఆహార ధాన్యాలు - కొరతగా ఉన్న పరిస్థితిలో ప్రభుత్వం చిక్కుకొని ఉంది.