పుట:Naajeevitayatrat021599mbp.pdf/728

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక్కడ మద్యనిషేధం విషయమై మరికొంత వివరంగా వ్రాయాలి. జూన్ 20 కి ముందే, ఈ మద్యనిషేధం రాష్ట్రంలోని ఇరవైనాలుగు జిల్లాలలోనూ ఒకేసారిగా తక్షణం ప్రకాశం ప్రభుత్వం అమలులోకి తేవలసిందని - వీథి వీథిని రాజాజీ వర్గీయులు తీవ్ర ప్రచారం ఆరంభించారు. రాజాజీ ఇంతకన్నా బలంగా, ముఖ్యమంత్రిగా పలుకుబడి గలిగిన రోజులలో ఒక జిల్లాకు మించి ఈ చట్టాన్ని అమలుపరచ లేకపోయారన్న విషయం అందరికీ తెలిసిందే.


యుద్ధానంతరం అనేక గడ్డుసమస్యలు ప్రజలను, ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నాయి అయినా, ఒక జిల్లాలో గాక, నాలుగు జిల్లాలలో మద్యనిషేధం అమలు జరపడానికి ప్రకాశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాని, ప్రకాశంగారికి గట్టిగా బాధ కల్పించడమన్నదే పార్టీలో ఎదురుగా ఉన్న మూడువర్గాలవారి ముఖ్యోద్దేశం గనుక, వారు ఏకమై, పార్టీలో - ఇరవైనాలుగు జిల్లాలలో మద్యనిషేధమనే నినాదం లేవదీశారు. ప్రకాశంగారు తాము మొదట చెప్పిన నాలు జిల్లాలలోనే గాక - అదనంగా కోయంబత్తూరు, అనంతపురము, కర్నూలు, బళ్ళారి అనే మరి నాలుగుజిల్లాలలోకూడా మద్యనిషేధం అమలుచేయడానికి అంగీకరించారు. దాంతో ఎదురుపక్షంవారు లేవదీసిన ప్రచండవాయువు పలచబడింది.

ఈ విధంగా, ఎన్నికయిన మర్నాటినుంచి ప్రకాశంగారి వర్గం - ఎదురుపక్షంగా ఉన్న మూడువర్గాలతో నిత్యమూ మల్లయుద్ధాలు చేయవలసి వస్తూండేది.

గ్రామాభ్యుదయ కార్యక్రమము

పదవీ స్వీకారం చేసిన పదిహేను రోజులలోనే, అనగా 15-4-46 న ప్రకాశంగారు ఆహార పదార్థాల కొనుగోలు, సరఫరా విషయమై ఒక స్కీము రూపొందించారు. అది రెండునెలలకు గవర్నరు దగ్గరికి వెళ్ళింది. అప్పటి గవర్నర్ సర్ ఆర్థర్ నై 13-6-46 న ఆ ఫైలుమీద "నేను చాలా శ్రద్ధతో మీరు పంపించిన స్కీమంతా చదివాను. ఇది నిర్దుష్టంగా ఉన్నది," అని వ్రాశారు.