పుట:Naajeevitayatrat021599mbp.pdf/727

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరునాడు అసెంబ్లీలో పార్టీ నిర్ణయం ప్రకారం పిళ్ళైగారిని స్పీకరుగా ఎన్నుకోవడం జరిగింది.

మంత్రివర్గము - ఇతర ఉత్తరువులు

క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో కాంగ్రెసు జండాగాని, ఇతర రాజకీయపార్టీల జండాలుగాని, పురపాలక సంఘ భవనాలపైన, స్థానిక సంస్థల (District Boards) భవనాలపైన ఎగురవేయ కూడదనే ఆంక్ష వుండేది. జూన్ 5 న ఆ ఆంక్షను ప్రకాశంగారు రద్దు చేసేశారు.

ఆ ఉద్యమం సమయంలో గ్రామస్థులకు పాఠం చెపుదామనే ఉద్దేశంతో అప్పటి గవర్నమెంటువారు జుల్మానాలు విధించారు. అనగా, నేరంతో సంబంధం ఉన్నా, లేకపోయినా గ్రామంలో ఉన్న ప్రతి గ్రామస్థుడూ ఆ జుల్మానాలో భాగం ఇచ్చుకోవలసిందే. ఇటువంటి జుల్మానాలను 1942 ఆగస్టు నెలలో - పది లక్షల ముప్పై మూడువేల రూపాయలమేరకు విధించారు. 1946 జూన్ 10 న వాటిని ప్రకాశంగారు రద్దు చేసేశారు.

1940, 41, 42 లలో సత్యాగ్రహులపైన వివిధ ఉద్యమాల సందర్భంగా విధింపబడిన జుల్మానాల నన్నిటిని 1946 జూన్ 17 న రద్దు చేసేశారు.

అన్ని దేవాలయాలలోకి - అంతవరకు లోనికి పోగూడదని ఎవరిపై ఆంక్ష ఉన్నదో, వారందరూ ప్రవేశించడానికి హక్కు కల్పిస్తూ ఒక బిల్లు జూన్ 20 న కేబినెట్‌లో ఆమోదించారు.

అదేరోజున, యుద్ధ సందర్భంలో నిలుపుదల అయిన మద్య నిషేధ చట్టము తిరిగి - సేలమ్, ఉత్తర ఆర్కాడు, చిత్తూరు, కడప జిల్లాలలో ప్రవేశ పెట్టడానికికూడా కేబినెట్ తీర్మానం జరిగింది.

అదే సమయంలో - మలబారు జిల్లాలో సర్వగ్రామవ్యాప్తంగా కొనుగోలు, ఉత్పత్తిదారుల కో - ఆపరేటివ్ సంఘాలు ఏర్పాటు చేయడానికీ కేబినెట్ తీర్మానించింది.