పుట:Naajeevitayatrat021599mbp.pdf/709

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నతో చెప్పినట్టు, అది సాకుగా చేసుకుని ఆయన ప్రకాశంగారిని నాయకత్వం వహించనీయకుండా చేయాలని యత్నించ సాగినట్టు అర్థమైంది. అది వివరించే ముందు మరొక విషయం చెప్పాలి.

హిందీ ప్రచారసభ రజతోత్సవము

గాంధీగారు చెన్నపట్నం చేరుకున్నారు. ఆయన చెన్నపట్నం రావడానికి పైన పేర్కొన్న ఉత్సవం కారణమని ఇదివరలో చెప్పడమయింది.

1921 లో ఆయన సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించినపుడు, దేశంలో ఇంగ్లీషుకు బదులు హిందీ అంతర్రాష్ట్రీయ భాషగా పరిణమించాలని ఉద్దేశించారు. దాని ప్రకారం, చెన్నపట్నంలో దాక్షిణాత్యులందరికి ఉపయోగపడేటట్టు మోటూరి సత్యనారాయణగారు ఈ ప్రచార సభను 1921 లో, మరి కొందరు పెద్దల సాయంతో ప్రారంభించారు. 1946 నాటికి వందలకొద్ది విద్యార్థులు హిందీలో శిరోమణి పరీక్షవరకు కూడా ఉత్తీర్ణులయ్యారు. ఆ సభ అప్పటికి పెద్ద భవనాలు కట్టుకోగలిగింది. ప్రచార సభలో ఆచార్యులుగా ఉండేవారికి వసతి భవనాలు కూడా కట్టుకోగలిగింది. చెన్నపట్నంలో త్యాగరాయనగర భాగంలో ప్రాముఖ్యం సంపాదించుకొన్నది.

ఈ కార్యకలాపాల మూలంగా సత్యనారాయణగారు - రాజాజీకి, గాంధీజీకి సన్నిహితులలో ఒకరుగా ఉండేవారు. ఆ కారణం చేతనే గాంధీగారు ఈ రజతోత్సవానికి తప్పకుండా హాజరయ్యారు. కొన్ని వేలమంది ఆ సభకు హాజరయ్యారు. గాంధీగారు కొంచెం అప్రస్తుతంగా - రాజాజీకి, దానికీ సంబంధం ఉండడంవల్లనే అన్ని వేలమంది సభకు హాజరయ్యారని ఆయన అన్నారు. అనంగీకార సూచకంగా సభలో నవ్వులు, గుసగుసలు బయలుదేరాయి.

గాంధీగారు అంతటితో ఊరుకోక, చెన్నపట్నంలో ఒక ముఠా [1] బయలుదేరి, రాజాజీకి వ్యతిరేకంగా అల్లరి చేస్తున్నారని అన్నారు.

  1. గాంధీగారు ఇంగ్లీషులో వాడినది - 'క్లిక్‌' (Clique) అనే పదము.