పుట:Naajeevitayatrat021599mbp.pdf/708

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూడా మిగలదనీ, తిరిగి వారు చెన్నపట్నం చేరిన తర్వాత, ఏ రోజు వ్యవహారం ఆ రోజున ఎలాగో నడిపించుకోవలసి వస్తుందనీ గుర్తుకు వచ్చి, ఒక ఏర్పాటు చేశాము. ధన మిచ్చేవారు ప్రత్యేకంగా ప్రకాశంగారి వ్యక్తిగత ఉపయోగ నిమిత్తమని ఇవ్వదలచితే, ఆ విధంగా వ్రాసి ఒక కవరులో పెట్టి, వేరేగా ఇవ్వవలసిందని ఏర్పాటు చేశాము. ఆ విధంగా ఎక్కడో మేము చెప్పడం మరచిపోయినచోట తప్ప, మిగతా అన్నిచోట్లా ప్రజలు - సభలలో ఆ విధంగానే వ్రాతమూలకంగానో, వ్రాయడానికి వీలులేని సమయాలలో నోటిమాటగానో చెప్పి డబ్బు ఇచ్చేవారు. ఆ విధంగా ప్రత్యేకించి చెప్పకుండా డబ్బు మాత్రం ప్రత్యేకంగా ఉంచేవారు. అది చాలా కొంచెం మొత్తంగా ఉండేది. కాని మేము ఎక్కడా డబ్బు ఇవ్వ వలసిందని - బహిరంగంగాగాని, రహస్యంగాగాని విజ్ఞప్తి చేయలేదు. అయితే, ప్రకాశంగారు మాత్రం తన జీవితం, బాధపడే ప్రచారకుల జీవితంకంటే వేరుకాదని, తనకు ఏర్పాటయిన డబ్బుకూడా తీసి, ప్రచారకులో, వారి కుటుంబంవారో ఎదురైనపుడు లెక్కా జమా లేకుండానే ఇచ్చేసేవారు.

ఇచ్చినదంతా ఇచ్చివేయగా, ఆయనకు ఇచ్చినదానిలో యాభై వేల రూపాయలు మిగలడం జరిగింది. మేము మొదట ఆ డబ్బు బాంకులో వేసి, ఆయనకు నియామకంగా ప్రతినెలా వేయిరూపాయల చొప్పున అందేటట్టు ఏర్పాటు చేద్దామనుకున్నాము. అయితే, స్వరాజ్య కంపెనీ తీర్చవలసిన బాకీ ఇంకా ఉంటూండగా ఈ డబ్బు ప్రత్యేకంగా బాంకులో వేయడం భావ్యం కాదనీ, తమ నిత్య జీవనంకోసం మేమంతా ఎటువంటి ప్రయాసా పడవద్దనీ, ఆ బాధ్యత ప్రజలు చూసు కుంటారనీ ఆయన చెప్పడంతో మేము చేయదలచుకున్న యత్నం వదులుకున్నాము.

గాంధీగారి ప్రమేయము

తరువాత అరిగిన విషయాలనుబట్టి - కళా వెంకటరావుగారు, గాంధీగారితో రైలులో కలిసి ప్రయాణం చేసిన సమయంలో ఈ యాభైవేల రూపాయల విషయమై ఒక విపరీతార్థం కలిగేటట్టు ఆయ