పుట:Naajeevitayatrat021599mbp.pdf/707

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్యాంకులో జమ కట్టారు. అందులోనుంచి డబ్బు తీయడానికి కోశాధికారి అయిన గుంటూరు నరసింహారావుగారికి అధికారం ఇవ్వడం జరిగింది.

ఇది ఇలా ఉంటుండగా, విడుదలయిన వెంటనే ప్రకాశంగారు రాష్ట్రం అంతటా పర్యటించారు. ఆ పర్యటనలో ఏవో ఒకటి రెండు జిల్లాలు తప్ప, తక్కిన జిల్లా లన్నిటి పర్యటనలోను నేను ఆయనవెంట ఉన్నాను. శ్రీకాకుళం జిల్లాకు మేము వెళ్ళినపుడు - జైలులోంచి విముక్తు లయిన స్వాతంత్ర్య యోధులను, వారి కుటుంబాలను; ఉద్యమ సమయంలో అండర్‌ గ్రౌండు అయిపోయి, అజ్ఞాతంగా ఉండి ఉద్యమం నడిపించిన వారిని సందర్శించడం మా ముఖ్యోద్దేశము.

అయినా సభల్లో కొందరు చిన్న చిన్న కవర్లలో డబ్బు తెచ్చి మా చేతుల్లో పెట్టడం మొదలు పెట్టారు. మాటల సందర్భంలో, "ప్రకాశంగారు తనుకున్న లక్షలన్నీ స్వాతంత్ర్య ఉద్యమ యజ్ఞంలో ఆహుతి చేసేశారు. వారికి, నిత్య జీవితయాత్ర నడపడానికి ధనం అవసరం కాబట్టి, ఇది దానికి వినియోగించండి," అని నాతో చెప్పేవారు. కొందరు ఏమీ చెప్పకుండానే చేతిలో డబ్బు పెట్టేసేవారు. ఈ పర్యటన సమయంలో, కొందరు కారాగృహ విముక్తులు, అజ్ఞాత ప్రచారకులు వచ్చి, ప్రకాశంగారితో తమ బాధ చెప్పుకోవడం తటస్థించేది. వెంటనే ప్రకాశంగారితో - డబ్బు, వారి చేతిలో ఉన్నా, నా చేతిలో ఉన్నా తీసి వారి కిచ్చేసేవారు. ఈ ఇచ్చినదానిలో ఆయన వ్యక్తిగతమైన ఉపయోగాలకని చెప్పి ఇచ్చిన ధనమూ ఉండేది. ఏదీ నిర్దేశించకుండా ఇచ్చిన డబ్బూ ఉండేది. మేము శ్రీకాకుళంజిల్లా, విశాఖాజిల్లా ఉత్తర భాగాలలోను పర్యటించి విశాఖపట్నం తిరిగి వచ్చి, రైలులో అనకాపల్లికి బయలుదేరుదామనే సరికి, ప్రకాశంగారికి ఇచ్చినదంతా పైన చెప్పిన విధంగా సంపూర్ణంగా ఖర్చయిపోయింది.

అప్పుడు నాకు, మరి కొందరు మిత్రులకు - ఇలా జరిగినట్లయితే ప్రకాశంగారికి స్వంత వినియోగంకోసం అభిమానులు ఇచ్చిన డబ్బు