పుట:Naajeevitayatrat021599mbp.pdf/706

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కంపార్ట్‌మెంటు.) అంతవరకు వెంకటరావుగారు, గాంధీగారితో ఏమి మాట్లాడారో మాకు తెలియదు.

ఆంధ్రదేశంలో తుఫాను

ఇక్కడ మరొక విషయం వివరించాలి. ప్రకాశంగారూ, మిగిలిన కాంగ్రెసువారమూ క్విట్‌ ఇండియా ఉద్యమ ఫలితమైన కారాగృహ నిర్భంధంనుండి విముక్తులమయిన తర్వాత, ఆంధ్రదేశంలో - శ్రీకాకుళం జిల్లా మొదలుకొని బందరు వరకు ఒక బ్రహ్మాండమయిన తుఫాను, ప్రచండమైన వాయువుతో కూడి చెలరేగడంవల్ల ఆ ప్రాంతాలలో పర్యటించడం అవసరమయింది.

ఆ తుఫానులో తోటలు గట్టిగా దెబ్బ తిన్నవి. శ్రీకాకుళంజిల్లా ఉద్దానంలోను, తూర్పు గోదావరిజిల్లా మధ్య డెల్టా భాగంలోను, ఈ రెండింటి మధ్యగల ప్రాంతంలోను కొబ్బరి చెట్లు భారత యుద్ధంలో హతులైన సైనికులవలె ఎక్కడివక్కడ నిర్మూలములయి, భూదేవతకు సాష్టాంగంగా నమస్కరిస్తున్నట్టు పడిపోయాయి. వేలాది అరటిచెట్లు దాదాపు అన్ని జిల్లాల లోను గెలలతో సహా ఒకదానిమీద ఒకటిగా నేల వాలినాయి. అదేవిధంగా, ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో నారింజ, నిమ్మ, బత్తాయి తోటలు పడిపోయినాయి. డెల్టా చివరి భాగాలలో ఎక్కడి నీరు అక్కడ నిలిచిపోయి, పెరుగుదలకు వస్తున్న పంటలు మునిగిపోయాయి. ఈ తుఫానువల్ల కలిగిన జలప్రళయానికి పశువులు కొన్ని, మనుష్యులు కొందరూ బలి కావడంకూడా జరిగింది. కొన్ని కొన్ని చిన్న గ్రామాలు - ద్వీపాలుగా మారి, అక్కడ ప్రజలు రెండు మూడు దినాలు ఏ విధమైన సహాయము అందక, ఆకాశం వైపు చూస్తూ నిరాహారులై ఉండవలసిన పరిస్థితులు కూడా కలిగాయి.

ఇది సంభవించినపుడు ప్రకాశంగారు, ఇచ్ఛాపురం మొదలు బందరు వరకు - కారుమీద, కాలినడకను, రెండెడ్ల బండిమీద - ఎక్కడ ఏలాగు అవసరమైతే ఆలాగు ప్రయాణం చేశారు. వీరి పర్యటనలో తుఫాను బాధితుల సహాయార్థం డబ్బు వసూలు చేశారు; పంచిపెట్టారు. మిగిలిన కొంత ఆంధ్రా సైక్లోన్ రిలీఫ్ నిధి అనే అకౌంటున ఆంధ్రా