పుట:Naajeevitayatrat021599mbp.pdf/677

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేరు సంవిధానం ముసాయిదాలో రాష్ట్రాల జాబితాలో చేర్చవలసిందని కోరగా, ఆ ముసాయిదాలో మొదట ఆ పేరు చేర్చడ మయింది. అయినప్పటికీ, సంవిధాన సభవారు నివేదిక ప్రకటించి నపుడు, ఆ పేరు మినహాయింప బడింది. రాష్ట్రాల నిర్మాణంలో కావలసిన పూర్వరంగ కార్యక్రమంగా ఏ యే జిల్లాలు ఒక రాష్ట్రంలో చేరవలెనో నిర్ణయమై ప్రకటింపబడాలి. అలా జరగకుండానే ఆంధ్రరాష్ట్రం పేరు జాబితాలో కలిపితే - అది మిగిలిన రాష్ట్రాలవలె రాష్ట్రంగా నడుచుకొనే అవకాశం లేనందువల్ల ఆ పేరు తీసివేయడమైందని ఆ నివేదిక పేర్కొనింది. తరువాత యీ ఆంధ్ర రాష్ట్రం విషయమై 1952 లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాయోపవేశం చేశారు. ఈ స్థితి కలగడానికి కారణం - మొదట కాంగ్రెస్ వర్కింగ్ కమిటీవారు భాషారాష్ట్రాలు స్వాతంత్ర్యానంతరం ఏర్పాటు చేస్తామని చేసిన తీర్మాన, వాగ్దానాలకు ప్రధానమంత్రి నెహ్రూ వ్యతిరేకంగా ఉండడం వల్ల, అటువంటి ఏర్పాట్లకు ఎటువంటి పూర్వ కార్యక్రమం జరగకపోవడమే, భాషారాష్ట్రాలకు ప్రధానమంత్రి వ్యతిరేకు లన్న సంగతి తెలిసే సరికి, రాష్ట్ర విభజన ఉద్యమం కుంటుపడింది. విభజనకు గల అభ్యంతరాలు బలపడ్డాయి. భాషా విద్వేషాలు పెరగ నారంభించాయి. ఈ ప్రభావం, 1946 లో ప్రకాశంగారు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడుకూడా బాగా తల యెత్తింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే, ఆయన మంత్రివర్గంలోని పి. డబ్ల్యూ. డి. మంత్రిగారు - చెన్నపట్నం మొదలుకొని ఉత్తరంగా తడ వరకు, నూటికి 75 నుంచి 95 శాతందాకా తెలుగు ప్రజలున్న గ్రామాల పేర్లను అరవ అక్షరాలతో వ్రాయించడం మొదలు పెట్టారు. మైలు రాళ్ళమీద అరవ అంకెలు చెక్కించ నారంభించారు.

చెన్నపట్నంలో 'పాపయ్య వీధి' అని ఒక వీధి ఉండేది. ఆ పాపయ్య తూర్పు ఇండియా కంపెనీవారి పరిపాలనా కాలంలో - తెలుగు, ఇంగ్లీషు దుబాసి (ద్విబాషి) గా ఉండేవాడు. ఆయన ఇంటిపేరు 'అవధానం వారు'. ఆ వీధి పేరు ఇంగ్లీషులో పాపయ్య స్ట్రీట్ అని వ్రాసి ఉండగా, ఈ తగాదాలు బలమైనపుడు పాపయ్య అన్న మాటకు చివర