పుట:Naajeevitayatrat021599mbp.pdf/678

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ర్" అన్న అక్షరం ఒకటి చేర్చి, 'పాపయ్యర్ వీధి'గా మార్చారు, రెండువందల సంవత్సరాలపాటు తెలుగు నేర్పూతూ ఉన్న ఎన్నో స్కూళ్ళలో తెలుగు క్లాసులు మూసివేయబడ్డాయి. అయితే, ప్రకాశంగారికి తెలుగు నాయకులే వ్యతిరేకంగా ఉండడంచేత ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటికీ, ఇటువంటి అవకతవకలను బలంగా అడ్డడానికి సత్తువలేకపోయింది. ఇటువంటి పరిస్థితులలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు, ఆంధ్రరాష్ట్రం ప్రత్యేకంగా కావాలనీ, అందులో చెన్నపట్నమూ చేర్చబడాలనీ ప్రాయోపవేశం చేశారన్న మాట అందరికి తెలిసిందే. ఆయన శానిటరీ ఇన్స్పెక్టరుగా ఉండి, సహాయ నిరాకరణోద్యమంలో ఆ పదవికి రాజీనామా ఇచ్చి, గాంధీగారి ఆశ్రమంలో చేరిన గాంధీవాది. ఆయన, ప్రభుత్వ కార్యాలయాలున్న కోటగుమ్మంవద్ద ప్రాయోపవేశం ఆరంభించగా, బులుసు సాంబమూర్తిగారు ఆ స్థలం మంచిది కాదని, ఆయనను తమ యింటికి తీసుకుపోయి, ఆ దీక్షాభంగం జరగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ప్రాయోపవేశం మాన్పించడానికి మారుగా - ప్రకాశంగారు, సాంబమూర్తిగారు ఆయన మంచంమీద కూచుని, ఆయన దీక్షను, పట్టుదలను హెచ్చుచేసి, ఆయన మరణానికి కారకులవుతున్నారని ఆంధ్ర వ్యతిరేకులు, మంత్రులు పలు విమర్శలు ప్రారంభించారు. ఏమైనా, అప్పటి ముఖ్యమంత్రి రాజాజీ మాత్రం ఉపవాస దీక్షలో ఉన్న శుద్ధ గాంధీవాది శ్రీరాములుగారిని ఒక్క మారైనా వచ్చి చూడలేదు. చివరకి ఆయన ప్రాణంపోయిన తరువాత కూడా - దహనానికి ముందుగాని, దహన సమయంలోగాని రాజాజీ రాలేదు; చూడలేదు; 'అయ్యో పాప' మని మాటయినా అనలేదు. బహుశా, అది రాజనీతి సంబంధమైన మౌనమేమో? యాభై రోజులు అలా ఉపవాసం జరిగేసరికి దేశంలో పెద్ద అలజడి ప్రారంభమయింది. యాభై ఎనిమిదో రోజున ఆయన దేహ త్యాగం చేసి, స్వర్గస్థులైనారు. దాంతో - తెలుగు జిల్లాలలో అనేక చోట్ల రైళ్ళను ఆపివేయడం, రైలు పట్టాలు తెగగొట్టడం, స్టేషన్లు కాల్చడం మొదలయిన అల్లర్లు కాల్పులు చాలా హెచ్చయినాయి. అయినా, అల్లరికి జడిసి, ఆంధ్ర