పుట:Naajeevitayatrat021599mbp.pdf/649

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ స్వరాజ్య పత్రిక జాతీయ నినాదాలను దేశం మూల మూలలా మారుమ్రోగించింది. పత్రికలు నడిపేవారికి నిర్భయత్వం కలిగించింది. అపమార్గంలో వెళ్లేవారికి యమదండంగా పరిణమించింది. జాతీయోద్యమ వార్తలు ఇతర పత్రికలు ప్రచురించడానికి జంకినా, సెక్యూరిటీలు ఎన్నెన్నిమాట్లు పోయినా వెనుకకు తగ్గకుండా స్వరాజ్య ప్రకటించేది. ప్రకాశం గారి సొంతడబ్బేగాక, వసూలు చేసిన వాటా ధనమే గాక, ప్రవాస భారతీయుల బాధలను గురించి ఆయన వ్రాసినది చదివిన బర్మా మలయా దేశాల భారతీయులు కేంద్ర శాసన సభ సభ్యుడుగా ఉన్న దినాలలో ఆయన అక్కడ పర్యటించి నపుడు అభిమానంతో విరాళాలుగా ఇచ్చిన లక్షలు కూడా ఈ పత్రికా నిర్వహణలో ఆహుతి అయిపోయినవి. చివరకు మిగిలింది పేరు ఒక్కటే. ఈ రోజున, ప్రకాశంగారి జీవితయాత్ర వ్రాసే సందర్భంలో. స్వరాజ్య పత్రికలు ఎక్కడైనా దొరుకుతాయా అని వెతికితే ఎక్కడా దొరకలేదు. ఆయన ఆ పత్రికలో వ్రాసే టప్పుడు, పత్రికకు హాని కలుగకుండా, ప్రభుత్వంవారేదైనా చర్య తీసుకుంటే తనపైనే సంపూర్ణమైన, వ్యక్తిగతమైన బాధ్యత తీసుకునేటట్లు - అనేక వ్యాసాలు, నిర్భయంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, తన పేరుమీద వ్రాసేవారు.

ఈ పత్రికా నిర్వహణలో, సంపాదకీయ వర్గంలో ఇంతో అంతో కాలం పనిచేసిన వారిలో ఈ క్రింది ప్రముఖులు ఉన్నారు:

వారు - కె. ఎం. ఫణికర్, పోతన్ జోసెప్, కోటంరాజు పున్నయ్య, కోటంరాజు రామారావు, కె. సంతానం, కోలవెన్ను రామకోటేశ్వరరావు, జి. వి. కృపానిధి, ఖాసా సుబ్బారావు మొదలైన వారు. ఇందులో చివర చెప్పిన ఇద్దరూ పత్రిక లిక్విడేషన్ అయ్యేవరకు జీతం అందినా, అందకపోయినా, దేశంమీద ఉన్న అభిమానంచేతా, ప్రకాశంగారిపై నున్న గురుభావంచేతా పత్రికను అంటిపెట్టుకుని ఉన్నారు.